నెల్లూరు: దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్సఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానం కింద ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాడ్ చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమీకరిస్తూ 2024 ఫిబ్రవరిలోనే గత వైయస్సాన్సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 6ని రిలీజ్ చేసినట్టు వివరించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 4,929 కోట్లు అసవరం కాగా, అందులో రూ. 3928 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమీకరించుకునేలా వెసులుబాటు కల్పించామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 991 కోట్లు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుందని వివరించారు. ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేకపోతుందా అని ప్రశ్నించారు. గడిచిన రెండేళ్లలో రామాయపట్నం పోర్టు కోసం ఎంత నిధులు ఖర్చు చేశారు? ఎంత పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీబీఎఫ్ఓటీ కింద పోర్టు దక్కించుకున్న సంస్థకు ఏయే నిబంధనలు విధించారు? ఎన్ని ఉద్యోగాలిస్తారు? మత్స్యకారులు, తీరప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపడటానికి ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏయే షరతులతో ప్రైవేట్‌టుపరం చేస్తున్నారు? దాని వల్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంటి? గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పూర్తి చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? తదితర ప్రశ్నలన్నింటికీ ముందుగా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేశారా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వైయస్ఆర్‌సీపీవైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - చంద్రబాబు మత్స్యకారుల పొట్టకొడుతున్నాడు రామాయపట్నం పోర్టు సాధనే ధ్యేయంగా గతంలో 2014-19 మధ్య వైయస్ఆర్‌సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకానమీ డెవలప్ చేసే విధంగా రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించారు. వైయస్ఆర్‌సీపీహయాంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు వాయువేగంతో జరిగితే చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని ప్రైవేటుపరం చేసే కుట్రతో రెండేళ్లుగా పనులు నత్తనడకన చేస్తూ వచ్చారు. వైయస్ జగన్ గారి చొరవతో దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును, కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు స్వాహా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్సఫర్ (డీబీఎఫ్ఓటీ) కింద ప్రైవేటుపరం చేసే కుట్రకు తెరదీశాడు. ఇప్పటికే నెల్లూరులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు, ఇప్పుడు రామాయపట్నం పోర్టును కూడ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి మత్స్యకారుల పొట్టకొడుతున్నాడు. - నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ప్రణాళిక తీరప్రాంతాల అభివృద్ధితోపాటు మత్స్యకారులకు అండగా నిలవాలని వైయస్ జగన్ గారు ముందడుగు వేస్తే ఆయనకు మంచి పేరొస్తుందనే కుట్రతో చంద్రబాబు పోర్టులను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్నాడు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా ప్రైవేటుపరం చేయడం చంద్రబాబు సర్కారు బరితెగింపునకు నిదర్శనం. సంపదను పెంచుతానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు, సముద్ర ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం మానేసి ప్రైవేటుపరం చేసే పనులకు శ్రీకారం చుడుతున్నాడు. రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేయడం సమంజసమా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా సొంతంగా అభివృద్ధి చేసే సత్తా లేదని చంద్రబాబు చెప్పదలచుకున్నారా? పోర్టు నిర్మాణం కోసం వైయస్ఆర్‌సీపీ హయాంలోనే ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చడం జరిగింది. కానీ చంద్రబాబుకి దోచుకోవాలన్న ఆలోచనతోపాటు వైయస్ జగన్ గారికి మంచి పేరు రాకుండా చేయలన్న కుట్ర తప్పితే ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు, మత్స్యకారులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. - ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే గడిచిన రెండేళ్లలో రామాయపట్నం పోర్టు కోసం ఎంత నిధులు ఖర్చు చేశారు? ఎంత పనులు చేశారు? ఏయే షరతులతో ప‌్రైవేటుపరం చేస్తున్నారు. దాన్ని వల్లప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంటి? గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పూర్తి చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? తదితర ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. అభివృద్ధి, ఉద్యోగాలు, సంపద సృష్టి వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డీబీఎఫ్ఓటీ కింద ఎంపిక చేసిన సంస్థకు ఎలాంటి రాయితీలిస్తున్నారు? పోర్టు వద్ద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విలువను ఏ విధంగా అంచనా వేశారు? మత్స్యకారుల హక్కులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను ఏ విధంగా రక్షిస్తారో చెప్పాలి. వీటన్నింటిపై ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విధానం ఏంటో వెల్లడించాలి. దాంతోపాటు పోర్టు రెండేళ్లుగా పూర్తి చేయకపోవడానికి కారణం ఎవరో కూడా చెప్పాలి. నిర్మాణం చేయకపోవడానికి కలిగిన ఇబ్బందులు ఏమిటో తెలపాలి. దానికోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. కాంట్రాక్టు పొందిన సంస్థ భవిష్యత్తులో తన పనితీరులో విఫలమైతే తిరిగి దాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలన్న నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? లేదా వారి ఇష్టారాజ్యానికి నడుపుకోవడానికి వదిలేశారా? లాంటి ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదు. కీలక నిర్ణయం తీసుకునేముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా కూటమి నాయకుల తాత్కాలిక ఆర్థిక అసవరాల కోసం పనిచేస్తున్నారని అర్ధం అవుతుంది. - ప్రైవేటీకరణ ముసుగులో దోపిడీకి వ్యూహ రచన వైయస్ఆర్‌సీపీ హయాంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్‌లు , 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని అనుమతులు పొంది శరవేగంగా పనులు జరుపుకొన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రెండేళ్లుగా జాప్యం చేస్తూ వచ్చారు. పోర్టుల నిర్మాణ విషయంలో చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగా పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడింది. తమిళనాడు మత్స్యకారులు మన మత్స్య సంపదను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించువడం కోలేదు. 10 ఫిషింగ్ హార్బర్‌లు అందుబాటులోకి తీసుకురావడం వల్ల 554 మత్స్యకార గ్రామాలకు ఉపాధి కలుగుతుంది. 6.30 లక్షల మందికి మేలు జరుగుతుంది. 9వేల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా పక్కనపెట్టి ప్రైవేటుపరం చేయాలని ఎందుకు తపిస్తున్నారో తెలియడం లేదు. తీరప్రాంత అభివృద్ధి ముసుగులో ప్రైవేటీకరణ పేరుతో తన వారికి ఏపీ మారిటైం బోర్డుకి చెందిన తీర ప్రాంత భూములు, వాటర్ ఫ్రంట్ ఏరియా, ఉప్పుసాగు భూములు కేటాయించుకోవడానికి పథక రచన చేస్తున్నారు. అ విధంగా దోచుకో పంచుతో తినుకో విధానంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకానీ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. బందరు పోర్టు నిర్మాణం విషయమే చూస్తే కాంట్రాక్టు విలువ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మార్చిలో రూ. 402 కోట్లకు పనులు కేటాయిస్తే, ఇప్పుడు మళ్లీ మరో రూ. 390 కోట్ల పనులు అప్పగిస్తూ కాంట్రాక్టు సంస్థకు నజరానా ప్రకటించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో తొలిదశలోనే రూ. 2,113 కోట్లతో 5 ఫిషింగ్ హార్బర్‌లు నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేస్తే, కూటమి ప్రభుత్వం వాటిని 4కి కుదించింది. ప్రాజెక్టు వ్యయం కూడా రూ. 632 కోట్లకు తగ్గించింది. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌ను ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌గా మార్చేసిం మత్స్యకారుల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. ఫిషింగ్ హార్బర్‌లను నౌకా కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే ప్రజలు, మత్స్యకారులతో కలిసి తీర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.