ఉదయగిరి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కన్వీనర్లు, ముఖ్య నాయకులు కలిసి పోలీసులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్న శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా, రాజకీయంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని నాయకులు అన్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.