విజయవాడ: విజయవాడ నగరంలోని ఎల్బీఎస్ నగర్‌లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులపై పీటీ మాస్టర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. క్రమశిక్షణ పేరుతో పీటీ మాస్టర్ రవీంద్ర రెడ్డి సుమారు 20 మంది విద్యార్థులను కర్రలతో కొట్టడంతో పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను అమానుషంగా కొట్టిన పీటీ మాస్టర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించి, ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠశాలలో కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేవని, ముఖ్యంగా బాత్రూమ్‌లు అత్యంత అధ్వానంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు, డివైఓ సాంబశివరావు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాఠశాలకు చేరుకుని గాయపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించడం అత్యంత దుర్మార్గమని మల్లాది విష్ణు మండిపడ్డారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దగా, ప్రస్తుతం ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. పాఠశాలల్లో కనీస పర్యవేక్షణ లేకపోవడంతో పాటు మౌలిక వసతులు అధ్వానంగా మారాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. అలాగే బాధ్యుడైన పీటీ మాస్టర్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.