స‌మ‌గ్ర భూస‌ర్వే వైఎస్ జ‌గ‌న్ ఘ‌న‌త 

తానే చేసిన‌ట్టు చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ

స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

ఏలూరు స‌భ‌లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీప‌చ్చి అబ‌ద్ధాలు

జగన్‌ చేసిన పనులకు క్రెడిట్‌ కొట్టేస్తున్నారు

పట్టాదారు పాస్‌బుక్స్‌, సమగ్ర భూసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌, 22- ఏ భూముల విషయంలో అన్నీ అబ‌ద్ధాలే

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు శ్రీకారం 

ల్యాండ్ రికార్డుల‌పై హైసెక్యూరిటీ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చింది జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే

పాసు పుస్త‌కాల ధ‌ర‌లు పెంచ‌డం త‌ప్ప చంద్ర‌బాబు చేసిందేమీ లేదు

ఒకే ఒక్క జీవోతో 22-ఏలోని భూములను జ‌గ‌న్ గారు విడుదల చేశారు

చంద్రబాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల భూముల‌ను 22ఏలో చేర్చి ఇబ్బంది పెడుతున్నాడు

చంద్రబాబు అబ‌ద్ధాల‌పై ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆగ్ర‌హం 

తాడేపల్లి: వైఎస్‌ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన సమగ్ర భూసర్వేకు ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్‌ కొట్టేస్తున్నాడ‌ని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పట్టాదారు పాస్‌బుక్స్‌, సమగ్ర భూసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌, 22- ఏ భూముల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగన్‌ హయాంలో సమగ్ర భూసర్వే ప్రారంభించినప్పుడు భూములు కొట్టేయడానికి సర్వే చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే సమగ్ర భూసర్వేను తానే ప్రారంభించానంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. 

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ విషయంలోనూ చంద్రబాబు నాయుడిది ద్వంద్వ వైఖరేనని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ తీసుకొచ్చి అమలు చేయాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు భూములు లాక్కుంటున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. టెక్నాలజీ గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు వాస్తవానికి ‘అబద్ధం అనే సాఫ్ట్‌వేర్‌’ మాత్రమే బాగా తెలుసని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమ‌ర్శించారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్‌, సమగ్ర భూసర్వే వంటి కార్యక్రమాలను తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకోవడం క్రెడిట్‌ చోరీకి నిదర్శనమని మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం విమానాలు, హెలిక్యాప్ట‌ర్లు, హైఎండ్‌ డ్రోన్లు వాడాం
 
వైఎస్ జగన్ గారి హయాంలో సమగ్ర భూసర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కుపైగా హైఎండ్ డ్రోన్లను మేము వినియోగించాం. GNSS, CORS, RTK, NRTK, GIS వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూసర్వే నిర్వహించాం. ఈ టెక్నాలజీ అంతా మేము ఉపయోగిస్తే, ఈరోజు మీరు అసలు ఈ టెక్నాలజీ అంతా నేనే తీసుకొచ్చాను, నేనే భూసర్వే చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,461 రెవెన్యూ గ్రామాలు ఉంటే, వైఎస్ జగన్ గారి హయాంలో మేము సుమారు 6,800 గ్రామాల్లో సమగ్ర భూసర్వే నిర్వహించాం. ఐదు సెంట్ల భూమిలో కూడా తేడా లేకుండా అత్యంత కచ్చితత్వంతో సర్వే చేశాం. టెర్రస్ట్రియల్ మ్యాపింగ్‌ను కూడా తొలిసారిగా మేమే ఇనిషియేట్ చేసి, అమలు చేశాం.

ల్యాండ్ రికార్డుల‌పై క్యూఆర్ కోడ్ కూడా మేమే తెచ్చాం 

భూముల రికార్డులకు అత్యాధునిక భద్రత కల్పించేందుకు క్యూఆర్ కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే. ఈరోజు చంద్ర‌బాబు క్యూఆర్ కోడ్ టెక్నాలజీ కూడా నేనే తీసుకొచ్చాను అని చెప్పుకుంటున్నారు. అసలు మోస్ట్ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న క్యూఆర్ కోడ్‌ను ల్యాండ్ రికార్డుల మీద అప్లై చేసింది కూడా గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ‌మే. గ్రామస్థాయికి రిజిస్ట్రేషన్ సేవలను తీసుకెళ్లింది కూడా వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే. మేము ఏర్పాటు చేసిన 15 వేల సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఈ-వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించాం. ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు కొత్తగా గ్రామస్థాయికి రిజిస్ట్రేషన్ సేవలు తీసుకొచ్చామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం?

పాస్ బుక్ ధ‌ర పెంచ‌డం త‌ప్ప, చంద్ర‌బాబు చేసిందేమీ లేదు

పట్టాదారు పాస్‌బుక్స్ విషయంలో కూడా చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వం రైతులకు ఏ టెక్నాలజీతో పట్టాదారు పాస్‌బుక్స్ ఇచ్చిందో, అదే పాస్‌బుక్స్‌ను రైతుల దగ్గర నుంచి తీసుకుని, రంగు మార్చి మళ్లీ ఇస్తున్నారు. అందులో మీరు కొత్తగా తీసుకొచ్చిన టెక్నాలజీ ఏదీ లేదు. పాస్‌బుక్స్‌లో ఉన్న టెక్నాలజీ కూడా వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీసుకొచ్చింది.
ఇంకా ఘోరం ఏమిటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పాస్‌బుక్ ధర రూ.55.79 ఉంటే, ఈరోజు రూ.70 చార్జ్ చేస్తున్నారు. రైతులపై అదనపు భారం ఎందుకు మోపుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 

నాడు ఒక్క జీవోతో 22-ఏ లోని భూములకు విముక్తి 

ఇక 22-ఏ భూముల విషయంలో కూడా మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో ఒకే ఒక్క జీవోతో 22-ఏలో ఉన్న భూములను విడుదల చేశాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 22-ఏ భూముల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. వెన్నుపోటు కూట‌మి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అనేక భూములను 22-ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు వారికి నచ్చిన వ్యక్తుల భూములను, వారి మాట వినే వ్యక్తుల భూములను మాత్రమే 22- ఏ నుంచి విడుదల చేస్తూ, మిగిలిన భూ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక్కసారి మీరు విడుదల చేసిన జీవో నెంబర్ 334ను చెక్ చేసుకోండి. 22-ఏ భూముల విషయంలో మీరు చేస్తున్నది ఏమిటంటే.. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఉంది. మా హయాంలో ఒకే ఒక్క జీవోతో 22-ఏలోని భూములను విడుదల చేస్తే, మీరు మాత్రం ఇప్పుడు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.

మేము చేసిన ప్రతి పనికీ క్రెడిట్ కొట్టేసే కుట్ర‌

వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో రీ-సర్వే కోసం పనిచేసిన ఫీల్డ్ సిబ్బందికి ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సమగ్రంగా భూసర్వే నిర్వహించాం. మేము చేసిన పనులకు, మేము తీసుకొచ్చిన టెక్నాలజీకి, మేము ఏర్పాటు చేసిన వ్యవస్థలకు ఈరోజు వారు క్రెడిట్ కొట్టేస్తున్నారు. చంద్రబాబు.. పాస్‌బుక్స్ విషయంలో, సమగ్ర భూసర్వే విషయంలో, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో, 22-ఏ భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మేము చేసిన పనులను మీరు చేసినట్టుగా చెప్పుకోవడం ఆపండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పడం నిజంగా బాధాకరం. మేము వైఎస్ జగన్ గారి నాయకత్వంలో భూముల విషయంలో చేసిన సంస్కరణలు, ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏర్పాటు చేసిన వ్యవస్థలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. మేము చేసిన ప్రతి పనికి క్రెడిట్ కొట్టేసి, ఇప్పుడు అవన్నీ నేనే చేశాను అని చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాస్తవాలు ప్రజల ముందు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం భూ రికార్డుల విషయంలో, సమగ్ర భూసర్వే విషయంలో, రైతుల కోసం చేసిన పనులను ప్రజలు మర్చిపోరని మొండితోక అరుణ్ కుమార్ అన్నారు.

Back to Top