27 నెలల తర్వాత పీఆర్‌సీ కమిషనర్‌ నియామకం.. ఉద్యోగులు, పెన్షనర్లకు ఒరిగేదేమిటి?

  ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాలయాపన.. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?

 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి: నలమారు చంద్రశేఖర్‌రెడ్డి

తాడేపల్లి: ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరాశకు గురిచేసిందని వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే నియమించిన పీఆర్‌సీ కమిషనర్‌ను పంపించి, 27 నెలల తర్వాత కొత్త కమిషన్‌ను నియమించడం వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ వస్తుందని ఉద్యోగులు ఆశిస్తే ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తోందని అన్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 30 శాతం మధ్యంతర భృతి హామీ ఏమైంది?

పీఆర్‌సీ అమలుకు ఇంకా సమయం పట్టే పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్న 30 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కనీసం 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

  ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే.. రెండే ఎలా ఇస్తారు?

ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అందులో కేవలం రెండు డీఏలను మాత్రమే అక్టోబర్‌ 1 నుంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. మిగిలిన డీఏలను ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒక డీఏ ఇస్తూ మరో మూడు డీఏలను పెండింగ్‌లో ఉంచితే సమస్య మరింత పెరిగి ఉద్యోగులు, పెన్షనర్లపై ఆర్థిక భారం పెరుగుతుందని తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు వివిధ రూపాల్లో కలిపి దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2022కి సంబంధించిన సరెండర్‌ లీవ్‌ను సంక్రాంతి సమయంలో ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. 2023, 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన సరెండర్‌ లీవ్‌ బకాయిలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

 పెన్షనర్ల హామీలను కూడా అమలు చేయాలి

70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ను 7 శాతం నుంచి 10 శాతానికి, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి ప్రతి నెలా వారి వాటాను ప్రభుత్వం మినహాయించుకుంటోందని, దానికి తన వాటాను కలిపి సంబంధిత ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈహెచ్‌ఎస్‌ను సక్రమంగా అమలు చేసి ఆసుపత్రులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

 జీపీఎస్‌ రద్దు హామీ ఏమైంది?

ఎన్నికల సమయంలో జీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పెన్షన్‌ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారని చంద్రశేఖర్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడిచినా ఆ హామీపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. మూడు లక్షలకు పైగా ఉద్యోగులు ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలను చేతల్లో చూపించాలని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, పీఆర్‌సీ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను పెండింగ్‌లో పెట్టి ఉద్యోగులను ఎలా ప్రభుత్వంలో భాగంగా చూస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని, వారి సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఉద్యోగులతో ప్రభుత్వం పెట్టుకుంటే ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Back to Top