తాడేపల్లి: డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ‘గురు పరిరక్షణ దీక్ష’ విజయవంతమైంది. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాలు అడుగడుగునా అక్రమాలకు నిలయంగా మారాయని, అర్హులను పక్కనబెట్టి అనర్హులకు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారని నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ దీక్షలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షకు ముందు సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీల భుజాలపై నల్ల కండువాలు వేసి దీక్షను ప్రారంభించారు. రోజుకో కొత్త కోణం.. అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి దీక్ష ప్రారంభం సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని తెలిపారు. అర్హతలు లేని వారు టీచర్లుగా నియమితులైనట్లు ప్రభుత్వమే తేల్చిందని పేర్కొన్నారు. నాలుగైదు జిల్లాల్లో రహస్యంగా విచారణ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు డీఎస్సీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా సాగిందో దీనితోనే అర్థమవుతోందన్నారు. నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు కొత్త విషయాలు బయటపడుతున్నాయని చెప్పారు. నకిలీ ఉపాధ్యాయులు భావితరాలకు ప్రమాదకరమని, ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారిని తొలగించకుండా నకిలీలను మాత్రమే ఏరివేయాలని స్పష్టం చేశారు. గురువుల స్థానంలో నకిలీలను తీసుకొచ్చారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గురువులను స్మరించుకోవడమే కాకుండా గౌరవించుకోవడం కూడా ప్రతి ఒక్కరి విధి అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలు చూస్తే విద్యావ్యవస్థలోకి నకిలీలను తీసుకొచ్చిన విషయం అర్థమవుతోందన్నారు. డీఎస్సీ ద్వారా భావితరాల భవిష్యత్తును దెబ్బతీసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ చేసిన అక్రమాల ప్రభావం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై పడుతోందని అన్నారు. సాక్ష్యాధారాలతో అక్రమాలను బయటపెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక్క నకిలీ టీచర్ ఉన్నా రాజీనామా చేస్తానన్న లోకేష్ ఎక్కడ? మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉపాధ్యాయుల నియామకాల్లోనే అక్రమాలు జరిగాయని ఉద్యమం చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. నకిలీ ఉపాధ్యాయులతో భావితరాలకు తీవ్ర ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా సంస్థల సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలోనే అక్రమాలు జరిగాయని తొలుత భావించినా, ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అక్రమాలు బయటపడుతున్నాయని తెలిపారు. ఒక్క నకిలీ టీచర్ ఉద్యోగం పొందినా రాజీనామా చేస్తానని లోకేష్ చెప్పారని గుర్తుచేస్తూ, ఇప్పుడు పదుల సంఖ్యలో నకిలీ టీచర్లు బయటపడుతున్నా ఆయన ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ ప్రతి దశలో అవకతవకలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదల నుంచి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ తీవ్రమైన అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్లు లీక్ కావడం, ఉద్యోగాల కోసం జీవోలు మార్చడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే డీఎస్సీ అక్రమాలపై తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాలని స్పష్టం చేశారు. డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం గురు పరిరక్షణ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, పి.సురేష్‌బాబు, ఇషాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 16 వేల పోస్టుల భర్తీలో 16 వేల ఆరోపణలు వస్తున్నాయని, టెట్ లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు ఇచ్చారని పేర్కొన్నారు. డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగి, ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షకు మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత, జోగి రమేశ్, ఆదిమూలపు సురేష్ తదితరులతో పాటు వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి నిమ్మరసం అందజేయడంతో ఎమ్మెల్సీలు దీక్ష విరమించారు.