నర్సారావుపేట: రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోవడానికి ముమ్మాటికీ వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. 1947 నుంచి 1995 వరకు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగినా ఓట్లకు డబ్బులు పంచే సంస్కృతి లేదని, 1995లో అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.50 చొప్పున ఇచ్చి చంద్రబాబే ఈ విష సంస్కృతికి బీజం వేశారని ఆరోపించారు. అప్పటి నుంచి అది క్రమంగా పెరిగి నేడు వేల రూపాయలకు చేరిందన్నారు. ప్రజలు డబ్బులు తీసుకోవడం మానేయాలని చంద్రబాబు సుద్దులు చెప్పడం కాదని, ముందుగా రాజకీయ నాయకులు ఓట్లకు డబ్బులు పంచడం ఆపాలని కాసు మహేష్‌రెడ్డి సూచించారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడైనా దరఖాస్తులు పెట్టుకోలేదని, నాయకులే తమ స్వార్థం కోసం ప్రజలను ప్రలోభపెట్టి ఈ దుస్థితికి తీసుకొచ్చారని అన్నారు. 1996లో రూ.50తో ప్రారంభమైన ఓటుకు నోటు సంస్కృతి ఇప్పుడు ఒక్కో ఓటుకు రూ.2 వేల వరకు చేరిందని, ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రూ.17 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు డబ్బు చేతులు మారుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నాయకులు ఇసుక, మైనింగ్, లిక్కర్, సిమెంట్ తదితర రంగాల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులు సైతం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అప్పులు చేసి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, గెలిచిన తర్వాత ఆ అప్పులు తీర్చుకునేందుకు దొంగ బిల్లుల బాట పడుతున్నారని అన్నారు. దీంతో ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న నిజమైన నాయకులు రాజకీయాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారంటూ వస్తున్న కథనాలను ప్రస్తావించిన ఆయన.. ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఓటుకు నోటు సంస్కృతిని ఆపే చిత్తశుద్ధి ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలని కాసు మహేష్‌రెడ్డి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఓటుకు నోటు సంస్కృతికి ముగింపు పలకాలని, తాను ప్రారంభించిన విష సంస్కృతికి చంద్రబాబే మంగళం పాడాలని హితవు పలికారు.