పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ భ్రమరాంబ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పవిత్రమైన నాంతాడు (మంగళసూత్రం) సమర్పించేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులను వెన్నుపోటు పార్టీ నేతలు, పోలీసులు అడుగడుగునా అడ్డుకుని దౌర్జన్యానికి దిగడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు దేవాలయం వద్ద వెన్నుపోటు పార్టీ శ్రేణులు సృష్టించిన ఉద్రిక్త వాతావరణం, వారు చేసిన దిగజారుడు రాజకీయాలపై సామాన్య భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరువు పోయిందనే భయంతో... పెదకాకాని శ్రీ భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం చోరీకి గురై 20 రోజులు గడుస్తున్నా దేవాదాయ శాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు. కేసు నమోదు చేసి తూతూమంత్రంగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ రూ.18 లక్షల వ్యయంతో కొత్త నాంతాడు తయారు చేయించి అమ్మవారికి సమర్పిస్తానని వారం క్రితమే ప్రకటించారు. భక్తులు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో తమ పరువు పోతుందని గ్రహించిన ప్రభుత్వం హడావుడిగా ఐదుగురు అర్చకులను సస్పెండ్ చేసి, రణధీర్ అనే అర్చకుడు దొంగతనం చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ కేసులో రణధీర్‌ను అక్రమంగా ఇరికించారని ఆయన కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే... ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఇంటి నుంచి వైయస్ఆర్‌సీపీ నాయకులు నాంతాడుతో బయలుదేరగా వెన్నుపోటు పార్టీ నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కారును సైతం ముందుకు కదలనీయకుండా చేసి దాడికి యత్నించారు. రోడ్లపై బైఠాయించి హంగామా సృష్టించారు. ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ వైయస్ఆర్‌సీపీ నాయకులను ఆలయం వైపు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. కేవలం 20 మందికే అనుమతి ఉందంటూ నిబంధనలు పెట్టి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్ఆర్‌సీపీ నాయకుడు వరికూటి అశోక్‌బాబు జుట్టు పట్టుకుని పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. చోరీకి గురైన తాళిబొట్టు స్థానంలో అమ్మవారికి నాంతాడు సమర్పించడానికి ముందుకొస్తే.. దానిపైనా రాజకీయాలు చేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. దేవుడిని దర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా? అని వారు ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు అమ్మవారికి నగలు సమర్పించడం నిషేధమా అని నిలదీశారు. భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని, భక్తులను అడ్డుకున్న వారి కుట్రలకు ఆ భ్రమరాంబ అమ్మవారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సంప్రోక్షణ పేరుతో మరో క్షుద్ర రాజకీయం... చివరకు తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైయస్ఆర్‌సీపీ నాయకులు అమ్మవారికి నాంతాడును సమర్పించుకున్నారు. అయితే, వైయస్ఆర్‌సీపీ నాయకులు అమ్మవారికి నాంతాడు సమర్పించి బయటకు వచ్చిన తర్వాత.. ఆ ప్రాంతం అపవిత్రమైందంటూ వెన్నుపోటు పార్టీ నాయకులు పసుపు నీళ్లతో కడిగి సంప్రోక్షణ పేరిట హడావుడి చేశారు. పవిత్రమైన ఆలయంలో వెన్నుపోటు పార్టీ నేతలు చేసిన ఈ రాజకీయ కక్షసాధింపు చర్యలపై సామాన్య భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కోన రఘుపతి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పొన్నూరు, వేమూరు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్‌బాబు, డైమండ్‌బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులతో పాటు అమ్మవారికి నాంతాడు తయారు చేయించేందుకు విరాళాలు ఇచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.