తాడేపల్లి: డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాల కారణంగా నష్టపోయిన మూడు లక్షల మంది నిరుద్యోగుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురు పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 ఒక్క అక్రమాల పుట్టగా తేలిపోయిందన్నారు. భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత కలిగిన ఉపాధ్యాయ పోస్టులను డబ్బుల కక్కుర్తితో లోకేష్ అమ్ముకున్నారని మండిపడ్డారు. ఆధారాలతో అక్రమాలను బయటపెట్టిన వైయస్ఆర్‌సీపీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడం నుంచి నిన్నటి ప్రభాకర్ వ్యవహారం వరకు డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఎన్నో ఆధారాలను వైయస్ఆర్‌సీపీ ప్రజల ముందుకు తీసుకొచ్చిందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. డీఎస్సీ గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. డీఎస్సీ నిర్వహణ తీరుపై అడుగడుగునా ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా వాటికి సమాధానం చెప్పుకునే ధైర్యం నారా లోకేష్ చేయడం లేదని పేర్కొన్నారు. బహిరంగ చర్చకు సవాల్ చేసి పారిపోయారు డీఎస్సీ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే నారా లోకేష్ పారిపోయారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మూడు లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.