అమలాపురం: ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతై, అనంతరం సురక్షితంగా తిరిగి రావడం ఎంతో ఆనందదాయకమని వైయస్ఆర్‌సీపీ అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. సురక్షితంగా తిరిగొచ్చిన మత్స్యకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ.. మత్స్యకారులు గల్లంతైన సమయంలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఆ క్లిష్ట సమయంలో వైయస్ఆర్‌సీపీ తరఫున వారి కుటుంబాలకు అండగా నిలిచి, ధైర్యం కల్పించడంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశామని గుర్తుచేశారు. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. బోటును తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి అందిస్తామని మత్స్యకారులకు ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాపూజీ, గ్రామ కమిటీ అధ్యక్షులు శేషగిరిరావు, ఉమా మహేశ్వరరావు, రాష్ట్ర ఆర్టీఐ జోన్-2 అధ్యక్షులు వర్మ, వెంకన్నతో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు.