వైయ‌స్ఆర్‌ విగ్రహ ధ్వంసం దుర్మార్గం

వైయ‌స్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వడ్డీ రఘురామ్‌ నాయుడు ధ‌ర్నా

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో మహానేత డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను వైయ‌స్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వడ్డీ రఘురామ్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ధ‌ర్నా చేప‌ట్టారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

వైయ‌స్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108, 104 సేవలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రజా నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కేవలం విగ్రహంపై దాడి కాదని, ప్రజల అభిమానాన్ని, ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యగా భావిస్తున్నామని వడ్డీ రఘురామ్‌ నాయుడు అన్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని, కానీ ప్రజా ఆస్తులు, మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా వెంటనే గుర్తించి, నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధ్వంసమైన వైయ‌స్‌ఆర్‌ విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించి, ఆ ప్రాంతంలో లైటింగ్‌, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైయ‌స్‌ఆర్‌ మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని, విగ్రహాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన ఆయనపై ప్రజల అభిమానాన్ని చెరిపివేయలేరని అన్నారు. వైయ‌స్‌ఆర్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, పట్టణ, మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top