తాడేపల్లి: అక్షరాస్యతపై కూటమి ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యాశాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబేంటని ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తికాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా PLFS (Periodic Labour Force Survey) 2023-24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018-19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023-24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన PLFS క్యాలెండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే. అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన UDISE గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది.