అల్లూరి సీతారామరాజు జిల్లా : ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గిరిజన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అరకులోయ మండల కేంద్రంలోని బస్కి పంచాయతీ పరిధి దేవరపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కోతకు వచ్చిన సమయంలో తుపాను ప్రభావంతో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతికి అందే సమయంలో నష్టం వాటిల్లడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి తగిన పరిహారం అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.