ఎస్ఈసీ ప‌క్ష‌పాత వైఖ‌రితోనే ప్ర‌జాస్వామ్యానికి ఓట‌మి 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వ‌జం 

పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ప‌రిష‌త్ ఎన్నిక‌ల అక్ర‌మాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కి ఫిర్యాదు చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ 

31,500 పోలింగ్‌ బూత్‌లకు గాను కేవలం 16 వేల బూత్‌లలోనే సీసీ కెమెరాలు

కుప్పం నుంచి పులివెందుల వరకు రిగ్గింగ్‌లు, దాడులు, అక్రమ నిర్బంధాలు

కౌంటింగ్‌ అక్రమాలపై సీసీ కెమెరాల ఫుటేజ్‌ భద్రపరచాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి

అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై న్యాయపోరాటం.. 

ఎస్‌ఈసీని సైతం ఈ అక్ర‌మాల‌కు బాధ్యత వ‌హించాల్సిందే 

లేళ్ల అప్పిరెడ్డి హెచ్చ‌రిక 

విజ‌య‌వాడ‌: ఎస్‌ఈసీ పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోతోందని, కట్టలు కట్టలుగా ఫిర్యాదులు, ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు ఆధారాలు సమర్పించినా ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమ‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి పార్టీల అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కి వివ‌రించిన అనంత‌రం అక్క‌డే పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల్లో టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు యథేచ్ఛగా తిరుగుతూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నార‌ని, అందుకే కౌంటింగ్‌ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరచాలని మరోసారి ఎస్‌ఈసీని కోరిన‌ట్టు చెప్పారు. ఆ ఫుటేజ్‌ ఆధారంగా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులను, అధికారులను న్యాయస్థానాల్లో బాధ్యులుగా నిలబెడతామ‌ని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. ఆయ‌న వెంట  మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి,  పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌తోపాటు పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. 

ఈ సంద‌ర్భంగా లేళ్ల అప్పిరెడ్డి  ఇంకా ఏం మాట్లాడారంటే....  

ప‌రిషత్ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జాస్వామ్యం ఖూనీ:

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గత మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం, హౌస్‌ అరెస్టులు చేయడం, పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపించడం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులను ఉపయోగించుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాలను తారుమారు చేసి టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.ఎస్‌ఈసీని కలిసి ఫిర్యాదులు చేసినా, ఆధారాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా ప్రశాంతంగా నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదు.

ఈ అక్ర‌మాల‌పై ఎస్ఈసీ చ‌ర్య‌లు తీసుకోవాలి :
 
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణలో వాటిని తుంగలో తొక్కారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీడియో షూటింగ్‌, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయలేదు. రాష్ట్రంలో మొత్తం 31,500 పోలింగ్‌ బూత్‌లు ఉంటే కేవలం 16 వేల బూత్‌లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 15 వేల పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం వీడియో షూటింగ్‌ కూడా సక్రమంగా జరగలేదు. కుప్పంలో సీసీ కెమెరాలు లేకుండా ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడిన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో పెట్రోల్‌ బాంబులతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ఏజెంట్లను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం, కీలక నేతలను హౌస్‌ అరెస్టులు చేయడం కొనసాగింది. శిల్పా రవి, చక్రపాణిరెడ్డి, కోడూరు శ్రీనివాసులు, మేరుగ నాగార్జున, శైలజానాథ్‌ వంటి వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధించారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే శంకర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు దిగుతుంటే, టెక్కలిలో అచ్చెన్నాయుడు ఏజెంట్లకు ఫోన్లు చేసి పిలిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోనూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారు. పల్నాడు జిల్లాలో ఉదయం 10.30 గంటలకే పోలింగ్‌ అయిపోయిందంటూ ఓటర్లను వెనక్కి పంపిన ఘటనలు జరిగాయి. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఉర‌వ‌కొండ‌లోని కూడేరు మండలంలో సీఐ ద‌గ్గరుండి దాడులు చేయించాడు. పోలీసు, రెవెన్యూ అధికారుల అండతో జరుగుతున్న ఈ అక్రమాలన్నింటికీ బాధ్యులు ఎవరో తేల్చాల్సిందే.

క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా ఫిర్యాదులు, ఆధారాలు స‌మ‌ర్పించాం: 

నిన్నటి కౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ గెలిచిన చైర్‌పర్సన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థుల విజయాలను ప్రకటించకుండా టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఫలితాలను తారుమారు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు యథేచ్ఛగా తిరుగుతూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారు. అందుకే కౌంటింగ్‌ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరచాలని మరోసారి ఎస్‌ఈసీని కోరాం. ఆ ఫుటేజ్‌ ఆధారంగా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులను, అధికారులను న్యాయస్థానాల్లో బాధ్యులుగా నిలబెడతాం. ఇప్పటివరకు కట్టలు కట్టలుగా ఫిర్యాదులు, ఆధారాలు సమర్పించినా ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఎస్‌ఈసీ పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోతోంది. ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజాస్వామ్యం ఓడిపోతోంది, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్న కూటమి నేతలకు మాత్రం అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇకపై అక్రమ నిర్బంధాలకు, రిగ్గింగ్‌లకు, కౌంటింగ్‌ అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్‌ఈసీని కూడా న్యాయపోరాటంలో బాధ్యురాలిగా నిలబెడతాం. తప్పు చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులందరిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

Back to Top