పూలుకుంట ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

  వ్యవస్థలే అధికార పార్టీకి కొమ్ముకాస్తే.. ఇది ఎన్నిక ఎలా అవుతుంది?

రాయచోటి:  పూలుకుంట ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి దేరింగుల పార్వతమ్మ ప్రకటించారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము వెనుకాడటం లేదని, అయితే నిష్పక్షపాత వాతావరణం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.30 గంటలకు తమ ఏజెంట్లు గంగిరెడ్డి, అరవ జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేయడం, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల నిర్వహణ కాదని ఆమె స్పష్టం చేశారు.

 స్థానికేతర ఓట్లతో ఎన్నికల పవిత్రత దెబ్బతింటోంది:
పూలుకుంటలో స్థానికేతరులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నా అడ్డుకునే వ్యవస్థ లేకపోయిందని పార్వతమ్మ పేర్కొన్నారు. ఓటు వేయడానికి వచ్చే సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా భయానక వాతావరణం నెలకొంటే అది స్వేచ్ఛాయుత ఎన్నిక ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, ఏజెంట్లను అరెస్టులు చేసి పోలింగ్‌ కేంద్రాల్లో తమ ప్రతినిధులు లేకుండా చేసి, బయటివారితో ఓట్లు వేయిస్తే దాన్ని ప్రజాస్వామ్య విజయంగా పరిగణించలేమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం కోసం బహిష్కరణ: 
కార్యకర్తల ప్రాణాలు, భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని పార్వతమ్మ తెలిపారు. ఓటమి భయంతో ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్యాయం, అక్రమాలు, వ్యవస్థల దుర్వినియోగానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడలేని ఎన్నికల్లో తాను భాగస్వామి కాలేనని, ఈ బహిష్కరణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమని పేర్కొన్నారు.

Back to Top