డబ్బు, అధికారం, బెదిరింపులతోనే కూటమి గెలుపు

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ఎమ్మెల్సీ పి. చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం 

నెల్లూరులోని వైఎస్సార్ సీపీ  నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి

వార్డుల విభజన ప్రక్రియ నుంచే అక్రమాలకు శ్రీకారం

పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాల మార్పుతో గందరగోళం

ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపణ 

నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులు

ఒక్కో డివిజన్ కు సుమారు రూ. 2 కోట్లు పంపిణీ చేసి ఒత్తిళ్లు

కౌంటింగ్ లోనూ అక్రమాలు 

ప్రెస్ మీట్ లో పి.చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ 

నెల్లూరు:  నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి డబ్బు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి. చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్ని కుతంత్రాలకు దిగారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు సిటీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ,  ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసారు. ఐదేళ్లపాటు ప్రజల మధ్య ఉండి సేవ చేసిన అభ్యర్థులను నామినేషన్ దశలోనే వివిధ కారణాలు చూపించి అనర్హులుగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా వారి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, వారి కోసం ఎంతవరకైనా పోరాడుతానని హామీ ఇచ్చారు.  రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.  నెల్లూరులో ఉన్న గౌరవప్రదమైన రాజకీయ  వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 

ఈ ప్రెస్ మీట్ లో పి. చంద్ర శేఖర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడరంటే...

డివిజన్ల విభజన ప్రక్రియ నుంచే అక్రమాలు: 
నెల్లూరు నగరంలో డివిజన్ల విభజన మొదలుకొని ఓటర్ల జాబితాల తయారీ వరకు అనేక అవకతవకలు జరిగాయి.  వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలను ముక్కలు చేసి వేర్వేరు డివిజన్లలో కలిపేందుకు ప్రయత్నించారు. కోర్టును ఆశ్రయించినప్పటికీ అధికారులు తమ పద్ధతులను మార్చుకోలేదు.  సెప్టెంబర్ 22న మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో విడుదల చేసిన డివిజన్ వారీ ఓటర్ల జాబితాలకు, నోటిఫికేషన్‌కు ముందు ఇచ్చిన జాబితాలకు భారీ తేడాలు ఉన్నాయి.  నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు వరకు కూడా ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, పోలింగ్ కేంద్రాలను మార్చడం ద్వారా అభ్యర్థులను, ఓటర్లను గందరగోళానికి గురిచేశారు.  63వ డివిజన్ నుంచి పోటీ చేసిన జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సిద్ధిక్ నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారు.  సిద్ధిక్ అక్టోబర్ 17న నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన సమయంలో మురళీకృష్ణ హోటల్ వద్ద జరిగిన చిన్న సంఘటనను సాకుగా చూపించి, అక్టోబర్ 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 19న ఆయన నామినేషన్‌ను అనర్హతకు గురిచేశారు.  అలాగే కబాడిపాలెం ప్రాంతానికి చెందిన శాంతి అనే మహిళ నామినేషన్‌ను కూడా అన్యాయంగా తిరస్కరించారు.  ఆమె టౌన్ లెవల్ ఫెడరేషన్  అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు. పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా ఉండి, ఇతర మహిళల కార్యకలాపాలను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే ఆమె నిర్వహిస్తున్నారు. అందుకు  ఎలాంటి జీతం లేదా గౌరవ వేతనం లేదు.  ఈ విషయంపై కలెక్టర్‌ను కలిసినప్పుడు కూడా ఆమె నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ చివరకు మళ్లీ అదే కారణంతో తిరస్కరించారు.  

బెదిరింపులు.. డబ్బులిచ్చి ఒత్తిళ్లు: 
నెల్లూరు సిటీలోని 57వ డివిజన్‌కు చెందిన మైనారిటీ నాయకుడు అబ్దుల్ మస్తాన్‌ను పాత కేసుల పేరుతో బెదిరించారు. నగరంలోకి వస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.  అలాగే 64, 58, 69, 10వ డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.  నామినేషన్లు ఉపసంహరించుకోవాలని డబ్బులు ఆశ చూపడం, లేదంటే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. బీ ఫారాలు ఇచ్చే సమయంలో ఇద్దరు అభ్యర్థులను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం రావడంతో, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డితో కలిసి కార్లు మార్చుకుంటూ వెళ్లి అభ్యర్థులకు బీ ఫారాలు అందించాల్సిన పరిస్థితి వచ్చింది.  నెల్లూరు నగర ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఒక్కో డివిజన్‌కు సగటున రూ.1.3 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు ప్రచారంలో ఉంది. పోలీసు అధికారులను పక్కన పెట్టుకొని టీడీపీ నాయకులు కాన్ఫరెన్స్ కాల్స్‌లో డబ్బులు అందించే విషయంపై మాట్లాడిన 15 రికార్డింగులు నా వద్ద ఉన్నాయి. ఎన్నికల్లో డబ్బు, అధికారం, బెదిరింపులు ప్రధాన పాత్ర పోషించాయి. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి గెల్చింది. ఏది ఏమైనా ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Back to Top