వైయస్సార్ జిల్లా: పరిషత్ ఎన్నికల సందర్భంగా వైయస్సార్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లపల్లి బూత్ వద్ద బీటెక్ రవి చిన్నాన్న రఘునాథ్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుని దాడి చేసి పత్రాలు చించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పార్లపల్లికి వస్తున్న వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కామసముద్రంలో బీటెక్ రవి సోదరుడి హల్‌చల్ పులివెందులలోని లింగాల మండలం కామసముద్రం పోలింగ్ బూత్‌ల వద్ద బీటెక్ రవి సోదరుడు భరత్ ఓవరాక్షన్‌కు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటు వేయడానికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దముడియంలో ముందుగానే దాడులు పెద్దముడియం మండలంలో పోలింగ్‌కు ముందే కూటమి నేతల దాడులు మొదలయ్యాయి. భూతపురం వద్ద వైయస్ఆర్‌సీపీ నేత కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. గుండ్లకుంటలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. వైయస్ఆర్‌సీపీ నేతలే టార్గెట్ పోలింగ్ సందర్భంగా పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లి సర్పంచ్ మహేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, నల్లపురెడ్డిపల్లికి చెందిన వైయస్ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు రాళ్లు సిద్ధం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బూత్‌ల వద్ద కిరాయి మూకలు? పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలను మోహరించి ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్రకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.