చీకట్లో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి

చిత్తూరు తోటపాళ్యంలో ఏజెంట్‌పై విచక్షణారహితంగా దాడి.. ప్రాణాపాయ స్థితిలో మునిరత్నం

చిత్తూరు: చిత్తూరు నగరంలోని తోటపాళ్యం పోలింగ్‌ బూత్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌గా కూర్చున్న మునిరత్నంపై టీడీపీ నేతలు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చీకట్లో బయటకు పిలుచుకెళ్లి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మునిరత్నం ఇంటికి వెళ్లిన అనంతరం స్పృహ కోల్పోయారు.

  ప్రభుత్వాసుపత్రి నుంచి రాణిపేట సీఎంసీకి తరలింపు

మునిరత్నాన్ని తొలుత చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాణిపేట సీఎంసీకి తరలించగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

 ఏజెంట్‌గా కూర్చుంటే గంజాయి కేసు పెడతామంటూ బెదిరింపులు

పోలింగ్‌కు ముందు రోజు స్థానిక టీడీపీ నాయకుడు షణ్ముగం.. మునిరత్నాన్ని పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌గా కూర్చుంటే గంజాయి కేసు పెడతానని, ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు స్థానికుల సమాచారం. అయినప్పటికీ మునిరత్నం వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌గా విధులు నిర్వహించడంతో దాడి జరిగినట్లు తోటపాళ్యం ప్రాంతంలో సమాచారం.

  ప్రాణాల కోసం పోరాడుతున్న మునిరత్నం

షణ్ముగం కుమారుడు చందు, ఆయన అనుచరుడు గణేష్‌ నేతృత్వంలో దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు కోరుతున్నాయి. పోలింగ్‌ ఏజెంట్‌గా విధులు నిర్వహించిన వ్యక్తిపై దాడి జరగడం ఎన్నికల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్న మునిరత్నం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Back to Top