వైయస్ఆర్ జిల్లా, కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైయస్ఆర్, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, పార్టీ నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ జిల్లాలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ మురళీనాయక్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించాలి పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీసులను కోరారు. ఎన్నికల సమయంలో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులు తరలివచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోవైపు వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ జిల్లాలోకి వందలాది మంది చొరబడ్డారని, పార్నపల్లి బూత్ వద్ద రాళ్లు, కర్రలతో తిరుగుతున్నారని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పోలీసుల సమక్షంలోనే బయటి వ్యక్తులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. లింగాల మండలంలో విలేకరిపై దాడి లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. జడ్పీటీసీ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి శ్రీదేవి, స్వతంత్ర అభ్యర్థి సురేఖపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. మహిళా అభ్యర్థులపై దాడి చేయడంతో పాటు వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కునేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. కర్నూలు మండలంలోనూ ఉద్రిక్తత కర్నూలు మండలంలోని ఆర్కే దుద్యాల, ఎదురూరు, తొలిసాపురం, బసాపురం, ఆర్.కొంతపాడు, సుంకేసుల గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని చోట్ల ఏజెంట్లకు సంబంధించిన పత్రాలను చించివేశారని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్లకు భద్రత కల్పించి, అభ్యర్థులు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.