పెట్రోల్‌ బాంబులతో టీడీపీ గూండాల బీభత్సం

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు.. 

ఏజెంట్లను అడ్డుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్న కూట‌మి నేత‌లు

తాడేప‌ల్లి: పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెనగలూరు నుంచి కుప్పం వరకు, పులివెందుల నుంచి ప్రకాశం జిల్లా వరకు వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు, నాయకులను అడ్డుకోవడం, పోలీసులు అరెస్టులు చేయడం, పోలింగ్‌ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు చొరబడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

రైల్వేకోడూరులో పెట్రోల్‌ బాంబులతో దాడులు

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో టీడీపీ వర్గాలు పెట్రోల్‌ బాంబులతో దాడులకు పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

పులివెందులలో పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ మంటలు

పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పోలింగ్‌ బూత్‌ల సమీపంలో పెట్రోల్‌ బాంబులు వేయడంతో భారీగా మంటలు చెలరేగి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం.

పుంగనూరులో ఏజెంట్లకు అడ్డంకులు

చౌడేపల్లి మండలం చారాల పోలింగ్‌ కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదంటూ ఆ పార్టీ నాయకులు, ఏజెంట్లు నిరసనకు దిగారు.

కందుకూరులో పోలింగ్‌ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని బబేవారిపాలెంలో టీడీపీ వర్గాలు పోలింగ్‌ బూత్‌లలోకి చొరబడి వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి.

గోనుగుంటలో ఏజెంట్ల అరెస్టుతో గ్రామస్థుల నిరసన

చీమకుర్తి మండలం గోనుగుంటలో సీఐ దాసరి ప్రసాద్‌ వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను అరెస్ట్‌ చేయడంతో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించినట్లు సమాచారం. ఏజెంట్లను విడుదల చేసే వరకు ఓట్లు వేయబోమంటూ వారు నిరసనకు దిగారు. కొనకనమెట్లలో ఏడుగురు వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు, దర్శి మండలం రాజంపల్లిలోనూ ఏజెంట్లను స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

దర్శిలో వందమంది బయటి వ్యక్తులతో రిగ్గింగ్‌?

దర్శి మండలం తానంచింతలలో దాదాపు 100 మంది బయటి వ్యక్తులు పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. చలివేంద్ర, వెంకటాచలంపల్లి, చినమనగుండం ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

ముచ్చుమర్రిలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి హౌస్‌ అరెస్ట్‌

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్ల‌కు నో ఎంట్రీ
చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివరామపురంలో మాజీ వైస్‌ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీలోని 14, 15వ బూత్‌లకు వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లుగా వెళ్లిన మహేష్‌, సోమశేఖర్‌లను టీడీపీ వర్గాలు అడ్డుకుని బూత్‌ నుంచి బయటకు పంపించారు.

కొమ్మనూతలలో మహిళల బైఠాయింపు

కొమ్మనూతల పోలింగ్‌ కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్థానిక మహిళలు, గ్రామస్థులు పోలింగ్‌ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. అందరికీ సమాన హక్కులు కల్పించి, వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని వారు కోరుతున్నారు. 

Back to Top