అన్నమయ్య జిల్లా, రాయచోటి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాలరాశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాయచోటిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల్సిన చోట భయం, బెదిరింపులు, అక్రమాలతో ప్రజల స్వేచ్ఛను హరించారని పేర్కొన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు భయమే ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే భయం, వేసిన నామినేషన్‌ను నిలుపుకోవాలంటే భయం, ప్రచారం చేయాలంటే భయం, పోలింగ్ నిర్వహించాలంటే భయం, చివరకు కౌంటింగ్ అంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు. కలెక్షన్లు, సెలక్షన్లు, నో ఎలక్షన్ విధానంలో ఎన్నికలు నిర్వహించారు. 80 పోలింగ్ బూత్‌లు ఉన్నచోట 70 బూత్‌లలోకి టీడీపీ శ్రేణులు వైయస్ఆర్‌సీపీ వారిని అనుమతించకపోయినా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. మాజీ ముఖ్యమంత్రి ఓటు వేసేందుకు వస్తుండగా ఆయన హెలికాప్టర్‌ను చివరి నిమిషంలో గాల్లోనే నిలిపివేసిన ప్రభుత్వ కుట్రను ప్రజలు గమనించారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచాయి. ప్రతిపక్ష నేతలు, ఓటర్లపై వేధింపులు ప్రతిపక్ష పార్టీ నాయకులు, అభ్యర్థులనే కాకుండా ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు, పాత కేసుల పేరుతో బెదిరింపులకు దిగారు. ఇంతటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఉండటం ఎందుకు? ప్రభుత్వమే జీవో జారీ చేసి ఫలానా వ్యక్తి చైర్మన్, ఫలానా వ్యక్తి కౌన్సిలర్ అని ప్రకటిస్తే సరిపోతుంది కదా? గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి అందించాం. నేడు వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాయి. రైతులను, పేదలను గాలికి వదిలేశారు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు పంట నష్టపరిహారంతో పాటు వారు చెల్లించిన బీమా ప్రీమియానికి అనుగుణంగా బీమా పరిహారం అందించాలి. రాబోయే కరువును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఎక్కడ? ఒక్క పక్కా ఇల్లు కూడా ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.1,500 లేదు, నిరుద్యోగులకు భృతి లేదు. మహిళలకు రక్షణ, భద్రత కరువయ్యాయి. రాష్ట్రంలో గంజాయి ముఠాలు పెట్రేగిపోతున్నా అరికట్టే చర్యలు కనిపించడం లేదు. రాప్తాడులో రంపంతో కోసి చంపే పరిస్థితులు రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తున్నాయి. రాయచోటి అభివృద్ధిని వెనక్కి నెట్టారు వెనుకబడిన ప్రాంతమైన రాయచోటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం. రాజంపేట, మదనపల్లి వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలను కాదని రాయచోటికి జిల్లా కేంద్రం తీసుకొచ్చాం. దీంతో రాయలసీమలో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో రాయచోటి ఒకటిగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి వెనక్కి వెళ్లడంతో పాటు శాంతిభద్రతలు కూడా క్షీణించాయి. 20 ఏళ్ల క్రితం నాటి అల్లర్లు మళ్లీ చెలరేగుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణానికి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. రాయచోటిని చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పిన నాయకులు, జిల్లా కేంద్రాన్ని కొనసాగించే బాధ్యత తీసుకోలేరా? జిల్లా కేంద్రాన్ని తిరిగి తీసుకొచ్చే ధైర్యం లేని వారికి ఈ విజయాలు ఎందుకు? ప్రజల ఓటే కూటమికి సమాధానం రాష్ట్రంలో, ముఖ్యంగా రాయచోటిలో జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారు. తమ ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారు. రాయచోటి పట్టణాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే వరకు విశ్రమించను. ప్రజల భద్రత, పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.