పోలీసుల వేధింపులు, టీడీపీ దాడులతోనే కర్నూలులో కూట‌మి గెలుపు

వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నామినేషన్ల దశ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. ఇన్ని అడ్డంకులు ఎదురైనా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు 11 మంది విజయం సాధించారని, టీడీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారని తెలిపారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై ఒత్తిళ్లు ప్రారంభించారు. పోలీసుల వేధింపులు, టీడీపీ నేతల దాడులతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను, అభ్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వేధించారు. పోలీసు అధికారులతో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారు. అయినప్పటికీ మా నాయకులను కాపాడుకున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడారు.

23వ వార్డులో 59 ఓట్ల గెలుపును తారుమారు చేశారు

కౌంటింగ్‌ సమయంలోనూ టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. కర్నూలు 23వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి 59 ఓట్ల మెజారిటీతో గెలిచినా, మంత్రి టీజీ భరత్‌ జోక్యంతో ఫలితాన్ని తారుమారు చేశారు. రీకౌంటింగ్‌ పేరుతో టీడీపీకి మెజారిటీ చూపించి, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఓడిపోయినట్లు రిటర్నింగ్‌ అధికారి ద్వారా ప్రకటించారు. ఇద్దరు దళితులు, ఒక బీసీ అభ్యర్థికి టీడీపీ నేతలు, మంత్రి టీజీ భరత్‌ అన్యాయం చేశారు. 23వ వార్డులో రీకౌంటింగ్‌తో పాటు రీపోలింగ్‌ నిర్వహించాలి. ఈ సవాల్‌ను మంత్రి టీజీ భరత్‌ స్వీకరించాలి. ఎన్నికల వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అధికారులు పచ్చచొక్కాలు ధరించి టీడీపీ నేతలకు అనుకూలంగా పనిచేశారు. పోలింగ్‌ బూత్‌లను కబ్జా చేసి ఓటింగ్‌ నిర్వహించిన పరిస్థితులు కర్నూలులో కనిపించాయి. మంత్రి స్థాయిలోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారు.

హైకోర్టులో న్యాయపోరాటం

ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై హైకోర్టును ఆశ్రయిస్తున్నాం. బాధ్యులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాం. 23వ వార్డులో రీకౌంటింగ్‌, రీపోలింగ్‌ నిర్వహించకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెనక్కి తగ్గేది లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధించేలా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాం.

Back to Top