అనంతపురం: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు కొత్త చరిత్ర సృష్టించారని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం.. ప్రజలు ఓటు వేయకుండా, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుని ఎన్నికల ప్రక్రియనే నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎన్నికలను ఇంత దుర్మార్గంగా కూడా నిర్వహించవచ్చని చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్, మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను అధికార దుర్వినియోగంతో నిర్వీర్యం చేసి, ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల పోటీ హక్కును కాలరాశారని వారు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొంటూ, ఎన్నికల పేరుతో చోటుచేసుకున్న పరిణామాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. మీడియా సమావేశంలో నేతలు ఏమన్నారంటే.. - ఎన్నికలు కాదు.. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే ప్రక్రియ : డాక్టర్ సాకే శైలజనాథ్, మాజీ మంత్రి ఎన్నికలను ఇంత దుర్మార్గంగా కూడా నిర్వహించవచ్చని చంద్రబాబు చేసి చూపించారు. ప్రజలు ఓటు వేయకుండా, అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం నుంచి పోలింగ్ కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను కొట్టి బయటకు పంపడం వరకు ఎన్నికల ప్రక్రియనే నిర్వీర్యం చేశారు. 22 అర్బన్ లోకల్ బాడీల్లో పోటీ లేకుండా చేయడం, 84 జెడ్పీటీసీలు, 2,198 ఎంపీటీసీల్లో పోటీ లేకుండా చేయడం ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి అధ్యాయం. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి ఇళ్ల వద్దకు వెళ్లి మహిళలను సైతం భయభ్రాంతులకు గురిచేయడం, బైండ్‌ఓవర్ల పేరుతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం, పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీకి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం చేయడం ద్వారా భయానక వాతావరణం సృష్టించారు. - పేదల ఓటు హక్కును కాపాడుకోవాలి.. కాలమే అందరికీ తీర్పు చెబుతుంది ఈ పరిస్థితుల్లో పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కౌంటింగ్ సమయంలోనూ వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని ప్రజల ముందుంచాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నికలను ప్రజలకు దూరం చేసి, వ్యవస్థలను భయపెట్టి, ప్రలోభపెట్టి నడిపించే రాజకీయాలకు కాలమే తీర్పు చెబుతుంది. రాబోయే రోజుల్లో కాలం ఇచ్చే తీర్పుకు అందరూ సిద్ధంగా ఉండాలి. - కౌంటింగ్‌లోనూ అక్రమాలకు తావిస్తే ప్రజలే తేల్చుతారు : తలారి రంగయ్య, మాజీ ఎంపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వరకు కనీవినీ ఎరుగని అక్రమాలు జరిగాయి. బలంగా గెలిచే వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం, కౌంటింగ్ కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను కొట్టడం, రౌండ్‌వారీ కౌంటింగ్ వివరాలు వెల్లడించకపోవడం, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య చెప్పకపోవడం, రీకౌంటింగ్‌లో అధికార పార్టీకి ఒక న్యాయం.. వైయస్ఆర్‌సీపీకి మరో న్యాయం చేయడం జరిగింది. కళ్యాణదుర్గంలో ఎస్‌ఆర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఐదారు వాహనాల్లో 50–60 మందితో పోలింగ్ కేంద్రాల్లోకి రావడం, శెట్టూరు, బెస్తరపల్లి, మాగలపల్లి, గుద్దెల్ల, విట్లంపల్లి, మాణిరేవు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడం దారుణం. - ప్రతి ఓటు.. ప్రతి బండిల్ లెక్కించాలి ప్రజలు వేసిన ప్రతి ఓటును తగ్గకుండా, ప్రతి బండిల్‌ను పక్కన పెట్టకుండా న్యాయంగా లెక్కిస్తే వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు గెలుస్తారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు, ప్రజలు కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లకూడదు. పోలీసులు, కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి రాకూడదు. ఎన్నికలను పోలీసుల నుంచి కాపాడాలి.. ప్రజలను కొద్దిమంది పోలీసు అధికారుల నుంచి కాపాడాలి అనే పరిస్థితి రావడం సిగ్గుచేటు. కళ్యాణదుర్గాన్ని ఎస్‌ఆర్ కంపెనీకి అప్పగించినట్లుగా వ్యవహరించడాన్ని సహించేది లేదు. ప్రజల ఓటు హక్కును, ఎన్నికల ఫలితాలను కాపాడే బాధ్యత అందరిదీ. - పోలీసుల నుంచి ప్రజలను.. ఎన్నికల అధికారుల నుంచి ఎన్నికలను కాపాడండి కొద్దిమంది పోలీసు అధికారుల నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు, బాధాకరం. ప్రజలను భయపెడుతున్నది ప్రత్యర్థి పార్టీ నాయకులు కాదు.. కొద్దిమంది పోలీసు అధికారులే. పోలీసుల నుంచి ప్రజలను కాపాడండి, ఎన్నికల అధికారుల నుంచి ఎన్నికలను కాపాడండి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? పెద్ద అధికారులు వ్యవస్థను గాడిలో పెట్టకుండా వదిలేస్తే చిన్నస్థాయి పోలింగ్ అధికారులు ఏం చేయగలరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ప్రజల ముందుంచుతాం అని శైలజనాథ్, తలారి రంగయ్య స్పష్టం చేశారు.