డోన్‌లో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌పై బుగ్గన తీవ్ర అభ్యంతరం

 రీకౌంటింగ్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం.. అసలైన విజేత ఎవరో తేలాలి

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

నంద్యాల జిల్లా : డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి బోయ చైతన్య 10,300 ఓట్ల మెజారిటీతో గెలిచామని ధీమాగా చెబుతున్నామని, కౌంటింగ్‌లో జరిగిన పరిణామాలపై రీకౌంటింగ్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వెల్లడించారు.

 10,300 ఓట్ల మెజారిటీతో గెలిచాం

డోన్‌లో మున్సిపల్‌ ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లతో గెలుస్తామని బహిరంగంగా చెప్పుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి బోయ చైతన్య 10,300 ఓట్ల మెజారిటీతో గెలిచామని మేము గర్వంగా చెబుతున్నాం. వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేసిన ప్రతి ఓటరు మనసులో చైర్మన్‌గా చైతన్యే ఉంటారు. అసలు విజేత ఎవరో ఓటర్లకు, పోలీసులకు, ఎన్నికల అధికారులకు కూడా తెలుసు.

 రీకౌంటింగ్‌లోనూ అక్రమాలు

ఏడో వార్డులో రుక్సానా మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు. రెండుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించినా ఆమె గెలుపు స్పష్టమైంది. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి పేరును ప్రకటించారు. మూడో రౌండ్‌ పూర్తయ్యే సమయానికి వైయ‌స్ఆర్‌సీపీ 500కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. చివరి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. కౌంటింగ్‌ సమయంలో ఓట్ల కట్టలను కలిపి ఉండవచ్చనే అనుమానం మాకు ఉంది. ఓట్లను దొంగతనం చేసి గెలవడం న్యాయమేనా?

  ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదు

పోలింగ్‌ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి ఓటర్లను డోన్‌కు తరలించారు. ప్రభుత్వమే డబ్బు పంపించి, ఏజెంట్లను కూడా తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. చివరకు కౌంటింగ్‌లోనూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థికి అన్యాయం జరిగింది. టీడీపీ గెలిచిందనే ప్రకటన వెలువడిన వెంటనే ప్రజల్లో భయం నెలకొంది. ప్రజలు ధైర్యంగా ఉండాలి. మీకు మేము అండగా ఉంటాం.

 న్యాయపోరాటం కొనసాగుతుంది

మున్సిపల్‌ పాలనకు సరైన అధికారిని కూడా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో ఇంతటి దిగజారుడు వ్యవహారం ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల కౌంటింగ్‌లో జరిగిన అక్రమాలపై రీకౌంటింగ్‌ కోసం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాం. మా పిటిషన్‌కు ఆమోదం లభిస్తే అసలైన విజేత ఎవరో తేలుతుంది. డోన్‌ ప్రజల తీర్పుకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.

Back to Top