తాడేపల్లి: పరిషత్ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి చేరాయని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అడ్డుకోవడం, దాడులు, నిర్బంధాలు, రిగ్గింగ్, ఓటర్లను భయపెట్టడం వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారని మండిపడ్డారు. గతంలో ప్రజలకు సురక్షితమైన రాష్ట్రాన్ని అందించిన వైయస్ఆర్‌సీపీ పాలన నుంచి.. నేడు ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర పరువును కాపాడుకోవాల్సిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల పోటీ హక్కును అడ్డుకునేలా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారని, ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలంగా మార్చేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రాష్ట్రాన్ని సేఫ్ ఆంధ్ర నుంచి సేవ్ ఆంధ్ర పరిస్థితికి తీసుకెళ్లిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినట్లు కనిపించినా, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వైయస్ఆర్‌సీపీ నైతికంగా గెలిచిందని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. ఇవి ఎలక్షన్సా లేక సెలెక్షన్సా? ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ప్రజలకు ఉన్న స్వేచ్ఛ, హక్కుకు అదే పునాది. కానీ చంద్రబాబు నాయుడు జరిపించిన ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్ చేశారు. ఇలాంటి ఎన్నికలను ఎన్నికలు అని ఎవరైనా అనగలరా? పూర్వం శకుని మాయాపాచికలతో ఆటను రిగ్గింగ్ చేసి కురుక్షేత్రానికి దారి తీసినట్టు.. ఈరోజు అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికలు జరిపిస్తున్నారు. ఇది ఎన్నికలా.. ఎలక్షన్సా లేక సెలెక్షన్సా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు, సూపర్ సెవెన్ అన్నాడు, మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చాడు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చి.. మీ కుటుంబానికి ఇంత, పిల్లలకు ఇంత, అక్కచెల్లెమ్మలకు ఇంత, రైతులకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పాడు. జూన్ 2024 నుంచి ఆ డబ్బులన్నీ ఖాతాల్లోకి వస్తాయని మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ మోసాలుగా మారాయి. ప్రజలు బాండ్లు చూపించి చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే తన అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశాడు. బైండ్ ఓవర్ పేరుతో ప్రజాస్వామ్య పోరాటానికి అడ్డుకట్ట ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మా పార్టీ కార్యకర్తలు, నాయకులను బైండ్ ఓవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించడం, అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియను రిగ్గింగ్ చేయడం ప్రారంభమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ టీడీపీ గుండాలతో కలిసి మా అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం మరింత బాధాకరం. నామినేషన్ల నుంచి విత్‌డ్రావల్స్ వరకు మాఫియా ముఠా స్క్రూటినీ పేరుతో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాల్లోని పేపర్లను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత బలవంతపు విత్‌డ్రావల్స్ జరిగాయి. ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించిన కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, వారి అధీనంలోని ఆర్‌వోలు కలిసి ఒక మాఫియా ముఠాగా ఏర్పడి ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎన్నికలకు రెఫరీగా ఉండాల్సిన ఎస్ఈసీ కూడా చంద్రబాబుకు పూర్తిగా తొత్తుగా మారిపోయింది. 17 మున్సిపాలిటీల్లో మా చైర్‌పర్సన్ అభ్యర్థులను అడ్డుకున్నారు ఇవి పార్టీ బేస్డ్ ఎలక్షన్స్. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న మా పార్టీ పోటీ చేస్తున్న సమయంలో 17 మున్సిపాలిటీల్లో మా చైర్‌పర్సన్ అభ్యర్థులను అసలు నామినేషన్లే వేయనీయలేదు. మరికొన్ని చోట్ల నామినేషన్లు వేసినా స్క్రూటినీ పేరుతో తిరస్కరించారు. ఏకంగా 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారు. పులివెందులలో 40 వార్డులకు 20 వార్డులకే అవకాశం ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో 40, 60, 80 వార్డులు ఉంటే అన్ని వార్డుల్లో పోటీ జరగాలి. కానీ పులివెందులలో 40 వార్డులు ఉంటే కేవలం 20 వార్డులకు మాత్రమే నామినేషన్లు వేయగలిగే పరిస్థితి కల్పించారు. అంటే కాళ్లు, చేతులు కట్టేసి పోటీలోకి దింపినట్టే. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చోట్ల సృష్టించారు. 84 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాల్లో పోటీని అడ్డుకున్నారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తంతు కొనసాగింది. 84 జెడ్పీటీసీ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా దాడులు చేయించడం, వేసిన చోట్ల స్క్రూటినీ పేరుతో తిరస్కరించడం జరిగింది. అలాగే 2,109 ఎంపీటీసీ స్థానాల్లోనూ నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారు. పోలింగ్ రోజున కూడా అభ్యర్థులను అరెస్టు చేయడం, పోలింగ్ ఏజెంట్లను బూతుల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ పట్టించుకోని ఎస్ఈసీ ఇంత తీవ్రంగా ఎన్నికల వ్యవస్థను కూనీ చేయడంతో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నామినేషన్ కేంద్రాలు, స్క్రూటినీ, విత్‌డ్రావల్స్, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయినా మున్సిపల్ ఎన్నికల్లో 11,378 పోలింగ్ కేంద్రాలకు కేవలం 5,737 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి కూడా అన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 31,460 పోలింగ్ కేంద్రాలకు కేవలం 16,064 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎస్ఈసీది కాదా? ప్రభుత్వానిది కాదా? డీజీపీది కాదా? నామినేషన్లు రిగ్గింగ్.. పోలింగ్ రిగ్గింగ్.. బ్యాలెట్ బాక్సులకూ రిగ్గింగ్ ఈ ఎన్నికలు ఎలా జరిగాయో నాలుగు మాటల్లో చెప్పాలంటే.. నామినేషన్ల రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూటినీ రిగ్గింగ్, పోలింగ్ బూతుల రిగ్గింగ్, పోలింగ్ పర్సెంటేజీల రిగ్గింగ్. చివరకు రాత్రిపూట బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్ అయ్యే పరిస్థితి. విశాఖపట్నంలో మా వాళ్లు ఆందోళన చేసి స్ట్రాంగ్ రూములకు సీల్ వేయాలని పట్టుబట్టిన తర్వాతే సీల్ వేశారు. ఇంతటి పరిస్థితుల్లో ఎక్కడైనా మా పార్టీ గెలిస్తే ఆ ఫలితాలను కూడా రిగ్గింగ్ చేశారని చెప్పుకునే స్థాయికి ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రమాణాలను దిగజార్చింది. సింగనమల నుంచి టెక్కలి వరకు పోలింగ్ కేంద్రాల్లో అరాచకం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సోదనపల్లిలో బూత్ ఏజెంట్లను బయటకు లాగేసి టీడీపీ గుండాలు రిగ్గింగ్ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను సీఐ పోలీస్ స్టేషన్‌లోనే బంధించారు. అదే నియోజకవర్గంలోని మురట్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తుంటే సీఐ రాజు కాపలా కాశాడు. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్లలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లాగి బయటకు పంపించారు. విజయనగరం పంచాయతీ 55, 56, 57, 58 వార్డుల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను కానిస్టేబుల్ బయటకు పంపించగా, లోపల టీడీపీ వాళ్లు ఉన్నారు. కర్నూలు రూరల్ మండలం సుంకేసులలో ఏజెంట్ ఫారాలను చింపేసి టీడీపీ గుండాలు దాడి చేశారు. తిరుపతిలో దొంగ ఓటర్లను పట్టుకున్నాం చంద్రగిరి నియోజకవర్గం సాయినగర్‌లో టీడీపీ భారీగా తరలించిన దొంగ ఓటర్లను మా వైయస్ఆర్‌సీపీ నాయకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో అందరూ చూస్తుండగానే రిగ్గింగ్ జరిగింది. పులివెందులలో ఓటర్లపై లాఠీచార్జ్, బెదిరింపులు నా సొంత నియోజకవర్గం పులివెందుల మండలం అచ్చివెల్లిలో ఓటు వేయడానికి వెళ్తున్న గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వేములలో ఓటర్లకు స్లిప్పులు ఇచ్చి ఓటు వేయకుండా వెళ్లిపోవాలని పోలీసులు, టీడీపీ గుండాలు బెదిరించారు. మీ ఓట్లు వాళ్లే వేస్తారని, మేమే వేసుకుంటామని చెప్పే పరిస్థితి వచ్చింది. లింగాల మండలంలో ఓటర్లపై దాడి చేసేందుకు బస్సుల్లో రాడ్లు, కర్రలు, రాళ్లు తీసుకొచ్చారు. వేముల జెడ్పీ హైస్కూల్ బూత్‌లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారు. మోట్నూతలపల్లిలో ఇళ్లల్లోకి వెళ్లి టీడీపీ గుండాలు దాడులు చేయగా, ఓటు వేయడానికి వస్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పెట్రోల్ బాంబులతో దాడులు.. అడ్డుకున్నవారినే అరెస్టులు రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పట్టుపురంలో టీడీపీ నేతలు ఓట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్న వైయస్ఆర్‌సీపీ వారినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం. ఏజెంట్లను బూతుల నుంచి గెంటేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు పుంగనూరు మండలం చౌడేపల్లి, దాదేపల్లి గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు గెంటేశారు. దర్శి మండలం తాళ్లూరు, శివరాంపురంలోనూ ఏజెంట్లను బయటకు పంపించారు. జగ్గయ్యపేట మండలం వత్సవాయిలో ఉదయం 7 గంటలకే వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కనిగిరి మండలం హెచ్చంపాడు, తిమ్మారెడ్డిపల్లి, లింగంగుంట్లలో ఏజెంట్లను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలూరు మండలం చిప్పగిరిలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను ఎస్‌ఐ నరసింహులు పోలీసు జీపులోకి ఎక్కించారు. పులివెందుల మండలం లింగాల, కోమనూతలలో ఏజెంట్లను లోపలికి అనుమతించకపోవడంతో మహిళలు, గ్రామస్థులు రోడ్డుపై నిరసన తెలిపారు. విలేకరులపై దాడులు.. పత్రికా స్వేచ్ఛపైనా దాడి పలమనేరు మండలం బీకోటలో ఓటు వేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ అక్రమ్‌పై సీఐ సోమశేఖర్ దాడి చేశారు. కొండేపి మండలం టంగుటూరు, కొలిజేడులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకోగా, వారికి పోలీసులు వంతపాడుతూ ఏజెంట్లను బెదిరించారు. సంతనూతలపాడులో గురువారెడ్డిపాలెం, కొర్రపాటివారిపాలెం గ్రామస్థులు తమను ఓటు వేయనివ్వకుండా రిగ్గింగ్ చేస్తున్నారని నిరసన తెలిపారు. మార్కాపురం నియోజకవర్గం కొనకమిట్ల మండలం చినమనగుండం 175వ బూత్‌లో టీడీపీ కార్యకర్త దగ్గరుండి దొంగ ఓటు వేయించాడు. టెక్కలిలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి జ్యోతి భర్త కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయగా, అడ్డుకున్న కృష్ణ చెల్లెలిపై కూడా పోలీసులు దాష్టీకం చేశారు. అనంతపురం రీపోలింగ్‌లోనూ అదే వ్యక్తి మళ్లీ ఓటు అంతకుముందు జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోలింగ్ ఏజెంట్లపై దాడులు, బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ ఘటనలు కోకొల్లలు. అనంతపురం 30వ డివిజన్ మూడో పోలింగ్ కేంద్రాన్ని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు ఆక్రమించి రిగ్గింగ్ చేశాడు. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో రీపోలింగ్ పెట్టాల్సి వచ్చింది. కానీ రీపోలింగ్‌లో కూడా అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఓటు వేశాడు. పోలీసులు అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు. వలయప్పనగర్‌లో రిగ్గింగ్, తిరుపతిలో సిరా చెరిపేందుకు రసాయనాలు చిత్తూరు జిల్లా వలయప్పనగర్‌లో టీడీపీ రిగ్గింగ్, సైక్లింగ్ ఎలా చేసిందో వీడియోల్లోనే కనిపించింది. తిరుపతిలో సిరా గుర్తులను చెరిపివేయడానికి పోలింగ్ బూత్ పక్కనే రసాయనాలు సిద్ధంగా పెట్టుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో 80 బూతులు ఉంటే 70 చోట్ల వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేసి, ఆ తర్వాత బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు. జర్నలిస్టులపై దాడులకు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టరు? ఈ అక్రమాలను రిపోర్ట్ చేసిన ఇండియా టుడే జర్నలిస్ట్ అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ విజయ్, ఎన్టీవీ రిపోర్టర్ సురేష్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్‌పై టీడీపీ వాళ్లు దాడులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాదు, పత్రికా స్వేచ్ఛను కూడా కూనీ చేశారు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఫుటేజ్ ఉండాలి కదా. ఎవరు దాడి చేశారో స్పష్టంగా కనిపిస్తుంటే ఆ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు? అరెస్టులు ఎందుకు చేయడం లేదు? పోలింగ్ శాతాలు రాత్రికి రాత్రే ఎలా పెరిగాయి? మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం మూడు గంటల నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. పోలవని ఓట్లను కూడా పోలైనట్టుగా చూపించి పోలింగ్ శాతాలను పెంచుకున్నారు. విశాఖపట్నంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు 9,19,367 ఓట్లు పోలైనట్టు చెప్పారు. రాత్రి 9.30 గంటలకు 9,45,915కు పెరిగాయి. సోమవారం ఉదయానికి 10,35,154కు చేరాయి. అంటే ఏకంగా 1,15,787 ఓట్లు పెరిగాయి. పోలింగ్ శాతం 51.46 నుంచి 56.3కి పెరిగింది. ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చీమకుర్తిలో రాత్రి 11 గంటలకు 78.28 శాతం ఉన్న పోలింగ్ అర్ధరాత్రి 12 గంటలకు 84.36 శాతానికి పెరిగింది. జమ్మలమడుగులో ఉదయం 11 గంటలకే 60 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య 11,958 ఓట్లు పోలైనట్టు చూపించి, 19 శాతం నుంచి 56.7 శాతానికి పెంచారు. ధర్మవరంలో రెండు గంటల్లో 30,157 ఓట్లు పోలైనట్టు చూపించి 8 శాతం నుంచి 36.36 శాతానికి తీసుకెళ్లారు. చిలకలూరిపేటలో రెండు గంటల్లో 20,772 ఓట్లు పోలైనట్టు చూపించి 7 శాతం నుంచి 37 శాతానికి పెంచారు. పార్వతీపురంలో 13,042 ఓట్లు పోలైనట్టు చూపించి 12 శాతం నుంచి 44 శాతానికి పెంచారు. ఇవన్నీ చూస్తే పోలింగ్ శాతాలను తమకు తామే పెంచుకుని రికార్డులు సృష్టించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్‌లో ప్రకటించిన ఓట్లకంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 92,900 ఓట్లు పోలైనట్టు ప్రకటించారు. కానీ కౌంటింగ్ టేబుళ్లపై దానికి మించి దాదాపు 7,000 ఓట్లు కనిపించాయి. ఈ విషయం బయటకు రాకుండా ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ గెలిచిందని ప్రకటించారు. ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబు ఎందుకు భయపడాలి? ప్రజలు ఎందుకు ఓటు వేయరు? మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులను మోసం చేసిన ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, 143 హామీలు అంటూ చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పినవన్నీ ఎక్కడికి పోయాయి? అక్కచెల్లెమ్మలకు ఆసరా లేదు, చేయూత లేదు, కాపు నేస్తం లేదు, ఓబీసీ నేస్తం లేదు. చివరకు సున్నా వడ్డీ పథకం కూడా ఎగ్గొట్టారు. విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు నీరుగారిపోయాయి. నిరుద్యోగ భృతి నెలకు రూ.3,000 ఇస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్డు మీద పెట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా చంద్రబాబును నిలదీసే పరిస్థితి వచ్చింది. రైతుకు ఉచిత పంటల బీమా లేదు. సమయానికి ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. రైతన్న తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తొలగించి పారదర్శక పాలనకు తూట్లు సచివాలయాలు పోయాయి. వాలంటీర్ వ్యవస్థ పోయింది. పారదర్శక పాలన పూర్తిగా కనుమరుగైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా దొరకని పరిస్థితి. పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాల్సిన ఆరోగ్యశ్రీ వెంటిలేటర్‌పై ఉన్నట్టుగా మారింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎక్కడ? ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఐఆర్ అన్నాడు.. పోయింది. పీఆర్సీ అన్నాడు.. దిక్కు లేకుండా పోయింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్‌గా మార్చేశారు 17 మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాల్లా అమ్మకానికి పెట్టారు. పోర్టులు, హార్బర్లలో స్కాములు చేస్తూ అమ్మకానికి సిద్ధం చేశారు. ప్రభుత్వ భూములను తమకు కావాల్సిన వాళ్లకు పావలాకు రూపాయికి కట్టబెడుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వీధిలో లిక్కర్, గంజాయి.. ప్రతి అంశంలో స్కామ్ ఏ వీధి చూసినా, ఏ వార్డు చూసినా, ఏ గ్రామం చూసినా లిక్కర్, గంజాయి దొరికే పరిస్థితి. రాజధానిలో స్కామ్, మట్టి స్కామ్, ఇసుక స్కామ్, లేటరైట్ స్కామ్.. ఏది చూసినా స్కామ్‌లే. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారింది. సేఫ్ ఆంధ్ర నుంచి సేవ్ ఆంధ్రకు మా హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే సేఫ్ ఆంధ్ర అనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ను సేవ్ ఆంధ్ర అని కాపాడుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గౌరవాన్ని చంద్రబాబు నాశనం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ను సౌత్ బీహార్‌తో పోల్చే పరిస్థితి తీసుకొచ్చారు. జెన్‌జీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతుంటే.. ఇక్కడ రిగ్గింగ్ ట్యూషన్లు ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతెత్తుతున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో రిగ్గింగ్ ఎలా చేయాలి, సైక్లింగ్ ఎలా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేయాలి అనే ట్యూషన్లు పెట్టి నేర్పించే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎస్ఈసీ, పోలీసులు, అధికార యంత్రాంగంపై ప్రజలకు పూడ్చలేని అగాధాన్ని సృష్టించారు. వారి విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం పోయింది. ఇది ఎన్నికల మానిప్యులేషన్ కాదు.. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర పరువును, రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తం పణంగా పెట్టాడు. ఇది కేవలం ఎలక్టోరల్ మానిప్యులేషన్ కాదు. ఇది ఎలక్షన్ సబ్‌వర్షన్. ఇది ఆర్గనైజ్డ్ క్యాప్చర్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ప్రజలకు ఓటు వేసే హక్కును, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించడం. ఇవన్నీ చట్టప్రకారం నేరాలు. మా కార్యకర్తలు, నాయకులు నిజమైన హీరోలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడూ చూడని విధంగా అణచివేతను ఎదుర్కొని ఈరోజు మేము నిలబడ్డాం. ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం ప్రజల హక్కు అని బలంగా గొంతెత్తాం. చంద్రబాబు చేస్తున్న అక్రమాలను దేశం దృష్టికి తీసుకెళ్లాం. ఇందులో మా కార్యకర్తలు, మా నాయకులు నిజంగా హీరోల్లా పోరాడారు. వాళ్లందరికీ సెల్యూట్ చేస్తున్నా. చంద్రబాబు గెలిచి ఓడాడు.. మేము ఓడి గెలిచాం చంద్రబాబు నాయుడు గెలిచి ఓడాడు. మేము ఓడి గెలిచాం. ఎందుకంటే ప్రజల మనసుల్లో మా పోరాటం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మేము చేసిన పోరాటం ఉంది. ఓటు హక్కు కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు ప్రజలు అండగా ఉంటారు. తుఫాన్లలోనూ ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. తుఫాను సమయంలో ఏ ప్రభుత్వానికైనా మొదటి బాధ్యత ప్రజల ప్రాణాలను కాపాడటం. కానీ అర్ణబ్ తుఫాను కారణంగా 10 మంది చనిపోయారు. పది రోజులు గడిచినా 150 గ్రామాలకు కరెంటు అందని పరిస్థితి ఉంది. మురుసు తుఫానులోనూ ఇద్దరు చనిపోయారు. రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయినా వారికి దమ్మిడి సహాయం అందించారా? గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన మోంతా తుఫానుకు సంబంధించి ఇప్పటికీ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. జీవోలు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా లేదు, సున్నా వడ్డీ లేదు, సీజన్ ముగిసేలోపు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. గిట్టుబాటు ధర లేదు. రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. హే రామ్.. సేవ్ ఆంధ్ర.. సేవ్ డెమోక్రసీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు అగసాట్లు పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజల హక్కులను కాపాడుకోవాలి. హే రామ్.. సేవ్ ఆంధ్ర.. హే రామ్.. సేవ్ డెమోక్రసీ. కేసులకు భయపడను.. ప్రజాస్వామ్య పోరాటం ఆగదు పులివెందుల్లో పోలీసులు కేసు పెట్టడం గురించి అడిగారు. పోలీసులు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేయడం కూడా తప్పేనా? 70 బూతుల్లో మా ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదని ఏజెంట్ ఫారాలు తీసుకుని ఆర్‌ఓకు ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యబద్ధంగా, గాంధేయ పద్ధతిలో, ఎలాంటి హింసకు తావులేకుండా సింబాలిక్‌గా నిరసన తెలిపాం. దానికే కేసులు పెడతారా? కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి. వాళ్ల చేతుల్లో అధికారం ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కేసులకు భయపడేది లేదు. పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఓటు హక్కు తీసుకున్నారు.. రేపు ఆస్తి హక్కుపై కన్ను ఈరోజు ఓటు హక్కును లాగేసుకున్నారు. నామినేషన్ పత్రాలను లాగేసుకున్నారు. రేపు పొద్దున ప్రజల ఆస్తులపై కూడా ఇదే దాడి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే 22ఏ కింద కొన్ని లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. రేపు మీరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మీ ఆస్తి పత్రాలు చూపిస్తే.. మీ కళ్ల ముందే ఆ పత్రాలను చింపేసి, ఈ ఆస్తి ఇక మీది కాదు అని చెప్పే రోజు కూడా వస్తుంది. అందుకే ఈరోజు ఓటు హక్కును కాపాడుకోవడం అంటే రేపు మన ఆస్తి హక్కును, మన ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడమే.