ఎన్నికల్లో జరిగిన హింస రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

కృష్ణా జిల్లా: గన్నవరం జెడ్పీ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందని, 30 నెలల పాలనలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందనే భయంతోనే నామినేషన్లు అడ్డుకోవడం, అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం, పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి చర్యలు జరిగాయని ఆరోపించారు.

నవంబర్‌ 1న ఎన్నికల సమయంలో జరిగిన హింస రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోతుందని వంశీ అన్నారు. కేసులు, బైండోవర్ల పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను వేధిస్తున్నారని, ప్రత్యర్థులకు మాట్లాడే హక్కు లేకుండా వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పాలకులు ఐదేళ్లపాటు మాత్రమే ప్రజల అధికారం అప్పగించిన తాత్కాలిక బాధ్యులని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం మళ్లీ వర్ధిల్లుతుంది

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎక్కువకాలం ఆపలేరని, రాష్ట్రంలో మళ్లీ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయని వంశీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని, తమ ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తే ఒక రాజనీతిజ్ఞుడిగా మిగిలిపోతారని, లేదంటే సాధారణ రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

Back to Top