పూసపాటిరేగలో ఎంపీటీసీ బీఫారాల లెక్కల్లో తేడాలపై వివాదం

టీడీపీ బీఫారాలు 9 నుంచి 12కు ఎలా పెరిగాయి? 

ఆర్వోను నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

విజయనగరం జిల్లా, పూసపాటిరేగ: ఎంపీటీసీ అభ్యర్థుల బీఫారాల జారీ, అభ్యర్థుల జాబితా ప్రకటనలో తలెత్తిన గందరగోళంపై పూసపాటిరేగలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ బీఫారాల సంఖ్య తొమ్మిది నుంచి పన్నెండుకు ఎలా పెరిగిందని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బీఫారాల జారీ, అభ్యర్థుల జాబితా ప్రకటనలో స్పష్టత లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు వెల్లడించిన వివరాలకు, రాత్రి 9.30 గంటలకు అందిన వివరాలకు మధ్య పొంతన లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీశారు.

బీఫారాల సంఖ్యలో మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, మహంతి శ్రీనివాసరావు ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఫారాల లెక్కల వివాదంతో పూసపాటిరేగలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఫారాల జారీకి సంబంధించిన రికార్డులను పరిశీలించి, లెక్కల్లో తేడాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
-----------
కుందుర్తిలో ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ బేరసారాలు!

బాపట్ల జిల్లా, అద్దంకి: సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎంపీటీసీ స్థానాలను ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకోవాల్సింది పోయి, బేరసారాల ద్వారా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Back to Top