తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నామినేషన్ల దశలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నారని, మహిళా అభ్యర్థులపైనా దాడులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల అనంతరం నామినేషన్ల ప్రక్రియ ముందుకు సాగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి వాసుదేవ (వాసు యాదవ్)ను కూడా రాజకీయ ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం అందుతోందని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. రిగ్గింగ్ చేస్తామని, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపిస్తామని, తమను ఎవరూ అడ్డుకోలేరని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాలపై అధికారులు తక్షణమే స్పందించి, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడం, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలింగ్‌కు సంబంధించిన దృశ్యాలను భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. మేయర్ అభ్యర్థి వాసు సీసీ కెమెరాల ఏర్పాటు అంశాన్ని సంబంధిత ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూల స్పందన లభించలేదని తమకు సమాచారం అందిందని భూమన తెలిపారు. ఈ విషయం నిజమైతే ఎన్నికల పారదర్శకతపై ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, ఓటర్లను బెదిరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలింగ్ ఏజెంట్ల విధులకు ఆటంకాలు కలగకుండా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిగ్గింగ్, దౌర్జన్యాలు, ఇతర అక్రమాలకు అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల పట్ల అధికారులు సమానంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడటం అధికారుల ప్రధాన బాధ్యత అని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమన్వయంతో పనిచేసి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.