తాడేపల్లి : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, వరద ముంపు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వైయస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వర్షపాత లోటు, సాగునీటి సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తుఫాన్ మరో భారంగా మారిందని పేర్కొన్నారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షపాత లోటుతో రైతులకు రెట్టింపు కష్టం అక్టోబర్ 27 నాటి ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ గణాంకాల ప్రకారం, 2026 జూన్ 1 నుంచి అక్టోబర్ 27 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 730.44 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 448.97 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని నాగిరెడ్డి తెలిపారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 38.53 శాతం లోటు ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుఫాన్ ప్రభావంతో కురిసే భారీ వర్షాలు, బలమైన గాలులు రైతుల కష్టాలను మరింత పెంచే ప్రమాదం ఉందన్నారు. 26 లక్షల ఎకరాల్లో వరి పంటకు ముప్పు ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37.53 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, అందులో సుమారు 26 లక్షల ఎకరాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ఉన్నాయని అందుబాటులో ఉన్న సాగు గణాంకాలను ఉటంకించారు. ఇప్పటికే ఎకరానికి రూ.40 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను కాపాడేందుకు పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా బయటకు పంపించాలని, పంట నష్టాన్ని మండలాలవారీగా అంచనా వేయాలని కోరారు. కొబ్బరి, అరటి రైతులకు ప్రత్యేక పరిహారం కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలకు బలమైన గాలుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నాగిరెడ్డి పేర్కొన్నారు. చెట్లు నేలకొరగడం, కాయలు రాలిపోవడం, తోటల్లో నీరు నిలిచిపోవడం వంటి నష్టాలను ప్రత్యేకంగా అంచనా వేయాలని కోరారు. గోదావరి లంక గ్రామాల్లో అరటి పంటతో పాటు కాకినాడ, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లోని ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించి, తోటల పునరుద్ధరణకు ప్రత్యేక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కీలకం రాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో సుమారు 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని నాగిరెడ్డి తెలిపారు. రొయ్యల చెరువుల్లో ఏరేటర్ల నిర్వహణకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని, విద్యుత్ అంతరాయాలతో నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అత్యవసరంగా పునరుద్ధరించాలని, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని కోరారు. తక్షణ చర్యలు చేపట్టాలి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పంట నష్టం, నీటి ముంపు, ఉద్యాన పంటల నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వరి, కొబ్బరి, అరటి, కూరగాయలు, ఇతర పంటలు, ఆక్వా సాగుకు జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, రవాణా, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని, నీటిలో మునిగిన పొలాల నుంచి నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, అత్యవసర ఆర్థిక సహాయం అందించడంతో పాటు, దీర్ఘకాలిక ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, సురక్షిత పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి. రైతుల పంటలను కాపాడటం, నష్టపోయిన రైతులను ఆదుకోవడం, ప్రజల సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఎం.వి.ఎస్. నాగిరెడ్డి స్పష్టం చేశారు.