ఇవి ఎన్నికలా..? సెలెక్షన్లా..?  

స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం: ఉషశ్రీ చరణ్‌

పెనుకొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెద్దఎత్తున బైండోవర్‌ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో ప్రతిపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, అధికార పార్టీకి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు.

టీడీపీ వారిపై చర్యలేవి?

నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరించడం అన్యాయమని ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై ఇదే స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. గోరంట్ల సీఐ శేఖర్‌తో పాటు పెనుకొండ, సోమందేపల్లి పోలీసు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూలేరు, వెంకటరమణపల్లి, రెడ్డిచెరువుపల్లి, సోమందేపల్లి, మావటూరు గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తీసుకుంటున్న చర్యలను ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు.

ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం

పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా అందరిపట్లా సమానంగా వ్యవహరించాలని ఉషశ్రీ చరణ్‌ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు డీఐజీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్‌ ఏజెంట్లను ఎన్నికల ప్రక్రియకు దూరం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు లేకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉషశ్రీ చరణ్‌ కోరారు.

Back to Top