కడప: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలను తలపించలేదని, అధికార బలం, పోలీసుల అండతో ఫలితాలను ప్రభావితం చేశారని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని, ముందస్తు ప్రణాళికతోనే రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న టీడీపీ నాయకులు తమకు ఓట్లు పడవని గ్రహించి, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేశారని విమర్శించారు. అధికార బలంతో ప్రజాతీర్పును మార్చారు ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా పోలీసు, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సైతం పోలీసుల సమక్షంలోనే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్పందనతో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు జాతీయ స్థాయికి చేరాయని తెలిపారు. వైయస్ఆర్‌సీపీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదు పోలీసులు, రౌడీలతో భయభ్రాంతులకు గురిచేసినా ప్రజలు స్వచ్ఛందంగా వైయస్ఆర్‌సీపీకి ఓట్లు వేశారని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని దాడులు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కడప మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీకి ప్రజల మద్దతు ఉందని, కడప ఎప్పటికీ వైయస్ఆర్‌సీపీకి కంచుకోటేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.