తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో తనపై, తన కారుపై బీగాలు రమేష్, ఆయన కుటుంబ సభ్యులు, పాల జనార్ధన్ దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనపై చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 127/2026 నంబరుతో కేసు నమోదైందని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తమిళనాడు ప్రాంతం నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యే థామస్ తనపై దాడి చేయించారని నారాయణస్వామి ఆరోపించారు. 1985లో పాదిరికుప్పం ఘటన సమయంలో కూడా తాము పోరాటాలు చేసినా ఇలాంటి దాడులు జరగలేదని పేర్కొన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కార్వేటినగరం మండలంలోని బీకేఆర్ కళ్యాణ మండపం, ఎస్.ఆర్.పురంలోని శంకర్ నాయుడు కళ్యాణ మండపం, పెనుమూరులోని భాస్కర్ నాయుడు ప్రాంతం, వెదురుకుప్పంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో వ్యక్తులను సమీకరించి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నామినేషన్ల రోజే దాడులు, బెదిరింపులతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని నారాయణస్వామి పేర్కొన్నారు. ఎస్.ఆర్.పురంలో జ్యోతిరెడ్డిపై దాడి జరిగిన దృశ్యాలను పరిశీలించాలని, జీడీ నెల్లూరులో మోహనకుమారి వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను చించివేశారని తెలిపారు. పెనుమూరులో జడ్పీటీసీ నామినేషన్ వేసిన నిరిషారెడ్డిపై జెడ్పీ హాలులోనే దాడి చేశారని, అల్లగుంటలో వెంకటేష్‌పై కూడా దాడి జరిగినట్లు పేర్కొన్నారు. వీరక నెల్లూరులో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిని భయపెట్టి టీడీపీ ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. దౌర్జన్యాల ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ జరిగిన ఘటనలకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను భద్రపరచాలని నారాయణస్వామి పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, జీడీ నెల్లూరు నియోజకవర్గంలో నామినేషన్ల సమయంలో మహిళలపై దాడులు జరగడం దీనికి నిదర్శనమని తెలిపారు. మహిళలపై దాడుల ఘటనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలని కోరారు. మరోవైపు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నారాయణస్వామి పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నామినేషన్ల దశలోనే చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.