తాడేపల్లి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బడ్జెట్ పుస్తకాల్లోని గణాంకాలకు, లోకేష్ విడుదల చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోయిందని వైయస్సార్‌సీపీ పీఏసీ మెంబర్ దువ్వూరి కృష్ణ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చెబుతున్న లెక్కల ప్రకారం 2025–26 మొదటి మూడు త్రైమాసికాల్లోనే రూ.465 కోట్లు ఖర్చు చేసినట్టు, ఆ తర్వాత మరో రూ.1,200 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారని.. నిజంగా ఈ రెండు మొత్తాలు విడుదలై ఉంటే సవరించిన అంచనాల్లో రూ.1,665 కోట్లు కనిపించాలి కదా? కానీ రూ.1,200 కోట్లు మాత్రమే ఎందుకున్నాయని ప్రశ్నించారు. అసెంబ్లీ, శాసనమండలిలో ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టిన లెక్కలకే విలువ ఉంటుంది తప్ప బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చినంత మాత్రాన నిధులు విడుదల చేసినట్టు కాదని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా ఎదురుదాడులు చేయడం మాని ఏ కాలేజీకి ఎంత బకాయి ఉంది, ఏ త్రైమాసికానికి ఎంత చెల్లించాలి, ఎప్పుడు బీఆర్ఓ విడుదల చేశారు, వాస్తవంగా ఏ తేదీన ఎంత చెల్లించారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని దువ్వూరి కృష్ణ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... జగన్ గారు చెప్పే లెక్కలన్నీ ఆడిట్ సంస్థలు నిర్ధారించినవే పేద విద్యార్థుల ఫీజులు, హాస్టల్ ఖర్చుల విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ గారు గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు చెప్పకుండా ఎదురుదాడులు, హేళనలకు దిగడం బాధ్యతారాహిత్యం. వైఎస్ జగన్ గారు ఎప్పుడూ కాగ్ లాంటి రాజ్యాంగ బద్ధ స్వతంత్ర సంస్థలు ఆడిట్ చేసిన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని మాట్లాడారనే విషయం అందరికీ తెలిసిందే. మేము చెబుతున్న ప్రతి లెక్కకు కాగ్ ఆడిటెడ్ అకౌంట్స్, ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాలే ఆధారం. కానీ బడ్జెట్ పుస్తకాల్లోని గణాంకాలకు, లోకేష్ ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు రూ.17,200 కోట్లు ఖర్చు వైఎస్ జగన్ గారు ప్రతి పేద విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలనే లక్ష్యంతో విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019–20 నుంచి 2023–24 వరకు ఐదేళ్లలో విద్యా దీవెన కింద రూ.12,350 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మొదటి ఏడాది 2019–20లోనే రూ.4,192 కోట్లు విడుదల చేశారు. గత టీడీపీ ప్రభుత్వం 2014–19 మధ్య పెట్టిన రూ.2,006 కోట్ల ఫీజు బకాయిలను కూడా మేమే చెల్లించాం. ఈ బకాయిల విషయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వమే శాసనమండలిలో అంగీకరించింది. అదేవిధంగా వసతి దీవెన కింద ఐదేళ్లలో రూ.4,850 కోట్లు ఖర్చు చేశాం. విద్యా దీవెన, వసతి దీవెన రెండు పథకాలకు కలిపి సుమారు రూ.17,200 కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.3,900 కోట్ల బకాయిలు పెట్టిందని లోకేష్ పూర్తి అవాస్తవాలు పలుకుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా చెల్లించలేకపోయిన 2023–24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన రూ.708 కోట్లు మాత్రమే అప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఆదేశాల వల్ల విడుదల చేయలేకపోయాం. పైగా దానికి సంబంధించిన డబ్బు ఖజానాలో ఉన్నా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించలేదు. ఇంకా సుమారు రూ. 9 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పాటు 2024–25, 2025–26, 2026–27లో పూర్తయిన మొదటి రెండు త్రైమాసికాలు కలిపి మొత్తం 12 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. విద్యా దీవెన కింద సుమారు రూ.8,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు కలిపి మొత్తం రూ.11,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా 2023-24 చివరి త్రైమాసికం పెండింగ్‌లో ఉంది. కూటమి ప్రభుత్వం 2024–25లో రూ.1,772 కోట్లు, 2025–26 సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.1,180 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు బడ్జెట్ పుస్తకాలు చెబుతున్నాయి. ఈ రెండు సంవత్సరాలకు కలిపి చెల్లించింది సుమారు రూ.3వేల కోట్లు మాత్రమే. ఇంకా రూ.8,700 కోట్లకు పైగా బకాయిలు మిగిలి ఉన్నాయి. వసతి దీవెన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత దారుణంగా ఉంది. 2024–25లో చెల్లించాల్సిన సుమారు రూ.1,100 కోట్లకు కేవలం రూ.38 కోట్లు మాత్రమే చెల్లించారు. 2025–26లో కూడా రూ.1,100 కోట్లకు బదులుగా సవరించిన అంచనాల ప్రకారం కేవలం రూ.100 కోట్లు మాత్రమే చూపించారు. అంటే ఏ విద్యార్థికీ ఇవ్వడం లేదని, ఈ పథకాన్ని దాదాపుగా ఎత్తివేశారని అర్థం అవుతోంది. బడ్జెట్ అంచనాలకు విరుద్ధంగా లోకేష్ లెక్కలు 2025–26లో రూ.1,665 కోట్లు విడుదల చేశామని లోకేష్ చెబుతున్న మాటలకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు విరుద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 10, 2026న రూ.1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి, అదే రోజు నిధులు విడుదలైనట్లు లోకేష్ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం రూ.1,200 కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. లోకేష్ లెక్కల ప్రకారం మొదటి మూడు త్రైమాసికాల్లోనే రూ.465 కోట్లు ఖర్చు చేసి, ఆ తర్వాత మరో రూ.1,200 కోట్లు విడుదల చేసి ఉంటే సవరించిన అంచనాల్లో రూ.1,665 కోట్లు కనిపించాలి కదా? కానీ రూ.1,200 కోట్లు మాత్రమే ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి బడ్జెట్ అంచనాల్లో రూ.219 కోట్లు చూపిస్తే, లోకేష్ తన ప్రకటనలో కేవలం రూ.77 కోట్లు మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి బడ్జెట్ లెక్కల్లో రూ.35.79 కోట్లు కనిపిస్తుంటే, లోకేష్ రూ.116 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో బడ్జెట్ అంచనాల్లో రూ.142 కోట్లు ఉంటే, లోకేష్ లెక్కల్లో రూ.95 కోట్లే ఉన్నాయి. మిగతా శాఖల్లోనూ ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి. కాబట్టి ఏ కాలేజీకి ఎంత బకాయి ఉంది, ఏ త్రైమాసికానికి ఎంత చెల్లించాలి, ఎప్పుడు బీఆర్ఓ విడుదల చేశారు, వాస్తవంగా ఏ తేదీన ఎంత చెల్లించారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. వాస్తవ చెల్లింపుల వివరాలు ప్రకటించాలి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్లం. దీంతో కాలేజీల్లో సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు సరిగా లేకపోతే తల్లిదండ్రులు యాజమాన్యాలను నిలదీసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నేరుగా కాలేజీలకు నిధులు చెల్లిస్తున్నామని చెబుతూ విద్యార్థులపై కన్వీనర్ కోటా ఫీజుల పేరుతో ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఫీజుల కోసం కాలేజీలు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలి. విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు పెడుతున్న ఒత్తిళ్లను అరికట్టాలి. ప్రతి కాలేజీకి సంబంధించిన చెల్లింపుల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలి. లోకేష్ అబద్ధపు ప్రచారాలు మానుకుని కాగ్ లెక్కలకు, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అధికారిక గణాంకాలకు సమాధానం చెప్పాలని దువ్వూరి కృష్ణ డిమాండ్ చేశారు.