పులివెందుల: సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు వద్ద వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా వెళ్తుండగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేయించేందుకు వెళ్తున్నట్లు పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ తన కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే వాహనాలను అడ్డుకుని దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన అవినాష్‌రెడ్డి, కూటమి నేతల తీరుతో పాటు పోలీసుల వ్యవహారశైలి, ఎన్నికల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తూ, తిరిగి వారిపైనే కేసులు పెడుతున్న పరిస్థితుల్లో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. మీడియాతో ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమన్నారంటే.. - పోలీసుల సమక్షంలోనే నా కాన్వాయ్‌పై దాడి మూడు రోజులుగా వైయస్ఆర్‌సీపీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రాణాలను పణంగా పెట్టి నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి పులివెందు నియోజకవర్గంలో ఉంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన ఆదేశాలు తెచ్చుకున్నాం. బలపనూరు, చెవ్వారిపల్లి, వై.కొత్తపల్లి, హిమకుంట్ల తదితర గ్రామాల అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు నేను కేవలం ఐదు వాహనాల్లో సింహాద్రిపురం, బలపనూరు క్లస్టర్లకు చెందిన తొమ్మిది పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నాను. అంకాలమ్మగూడూరు వద్ద బీటెక్ రవి, జోగిరెడ్డి, ప్రభాకర్ తదితరులు వందల మంది మూకలతో మా వాహనాలను అడ్డుకున్నారు. అక్కడ దాదాపు 50 నుంచి 70 మంది పోలీసులు ఉన్నారు. వారి కళ్ల ముందే నా కారుపై, నా కాన్వాయ్‌పై, మా ఐదు వాహనాలపై, అభ్యర్థులపై రాళ్లు వేశారు. పెట్రోల్ బాంబులు వేశారు. మా కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది పోలీసుల సమక్షంలోనే జరిగిన దాడి. - హైకోర్టు ఆదేశాలున్నా నామినేషన్లు వేయనివ్వడం లేదు నేను గలాటాకు వెళ్లలేదు. నామినేషన్లు వేయించేందుకే అభ్యర్థులను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నాను. సింహాద్రిపురం ఎస్ఐకి ముందుగానే మెసేజ్ పెట్టాను. సీఐకి సమాచారం ఇచ్చాను. హైకోర్టు ఆర్డర్లు కూడా పంపించాను. నిన్నటి నుంచి ఎస్పీ గారితో పదులసార్లు మాట్లాడి ఆదేశాలను అమలు చేయాలని కోరాను. నిన్న సాయంత్రం మా అభ్యర్థులను తీసుకెళ్లి నామినేషన్ పత్రాలు చించి వెనక్కి పంపించారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి రాకూడదని నేనే స్వయంగా అభ్యర్థులను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే మా మీద, మా కార్ల మీద రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అసలు పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతుంటే శాంతిభద్రతలు ఉన్నాయా? ప్రజాస్వామ్యం ఉందా? నామినేషన్లు వేయడానికి వెళ్తున్న మా అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులు చేయడం, మళ్లీ వారిపైనే కేసులు పెట్టడం ఏం పోలీసింగ్? ఏం ప్రభుత్వం? - పెట్రోల్ బాంబులతో దాడులు జరిగితే ఎన్నికల కమిషన్ ఎందుకు? డీఎస్పీ మురళీ నాయక్ 70 వాహనాలతో వెళ్లామని చెబుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. నేను కేవలం ఐదు వాహనాల్లోనే వెళ్లాను. పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి, హైకోర్టు ఆదేశాల ప్రకారం మా అభ్యర్థులను మీకు అప్పగిస్తాం, మీరు తీసుకెళ్లి నామినేషన్లు వేయించండి అని చెప్పాను. అయినా మాకు ఈ పోలీసులపై ఒక్క శాతం కూడా నమ్మకం లేదు. వేల్పుల రాముపై 2025 ఆగస్టులో జరిగిన దాడి నుంచి ఇడుపులపాయ, చక్రాయపేట, తొండూరు వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మా వాళ్లపై దాడులు చేసి, రివర్స్‌గా వారిపైనే 307 సెక్షన్ కేసులు పెడుతున్నారు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇష్టం వచ్చినట్టు ఈ సెక్షన్లు పెట్టి వందల మంది, వేల మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. మేము నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డుకోవడం, మా మీదే కేసులు పెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? పెట్రోల్ బాంబులతో, రాళ్లతో ఒక మనిషిపై దాడి చేస్తే దాన్ని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ మాత్రం దానికి ఎన్నికల కమిషన్ ఎందుకు? ఈ నామినేషన్ల ప్రక్రియ ఎందుకు? ప్రతి సామాన్యుడూ ఒక్కసారి ఆలోచించాలి.