పులివెందుల (వైయస్సార్ కడప జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల మొదలు పరిషత్, పంచాయతీ ఎన్నికల వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్సార్సీపీ శ్రేణులను నామినేషన్లు వేయనీయకుండా అరాచకాలకు పాల్పడుతున్నారని కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాము చేసిన దౌర్జన్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ముందు చాప వేసుకుని ధర్నా డ్రామా ఆడుతున్నారని వైయస్.అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలింగ్ నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగితే ఎవరిబలమెంతో, ఎవరికి ప్రజామోదం ఉందో తేలిపోతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే... - ఇది కామెడీ డ్రామా.. ప్రజలే నవ్వుకుంటున్నారు బీటెక్ రవి ఇవాళ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం చూస్తుంటే తన కామెడీ చూసి నవ్వుకోవాలో, లేక నీచ రాజకీయం చూసి అసహ్యించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పులివెందుల ప్రజలు ఉన్నారు. గడిచిన ఐదు వారాలుగా వీళ్లు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను కవర్ చేసుకోవడానికి, వాస్తవాలను వక్రీకరించడానికే ఈ ధర్నా డ్రామా చేస్తున్నారు. వాస్తవానికి కొట్టేది వాళ్లే, తప్పుడు కేసులు పెట్టేది వాళ్లే, మళ్లీ ఏడ్చేది, నిరసన తెలిపేది కూడా వాళ్లే. అన్నీ 'ఆల్ ఇన్ వన్' వీళ్లే చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఇతను ఏం చెబితే అదే జరుగుతుందనే విషయం పులివెందల ప్రజలందరికీ తెలుసు. అలాంటిది మళ్లీ స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేస్తుంటే దారిన పోయే సామాన్యులు సైతం వీళ్లను చూసి ఎద్దేవా చేస్తున్నారు. ఆందోళన విరమింపజేయడానికి డీఐజీ కోయ ప్రవీణ్ గారు స్వయంగా రావడం, హామీ ఇవ్వడం అంతా ఒక పెద్ద డ్రామా. - స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అరాచకం గడిచిన ఐదు వారాలుగా మున్సిపల్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వరకు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలంతా చూశారు. బయట నియోజకవర్గాల నుంచి టీడీపీ కిరాయి మూకలను తీసుకొచ్చి, పోలీసుల అండతో నామినేషన్ కేంద్రాల చుట్టూ మొహరించారు. కర్రలు, రాళ్లు, బాటిళ్లు, పెట్రోల్ బాంబులతో మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. పోలింగ్ రోజున ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లలోకి వెళ్లనీయకుండా దాడులు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే వేంపల్లె, గిడ్డంగివారిపల్లి వంటి చోట్ల మా వాళ్లు నామినేషన్లు వేయగలిగారు. నామినేషన్ల కోసం నిన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు రోడ్డుపై ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. - బాధితులపైనే రివర్స్‌లో 307 కేసులు.. ఇంతటి వరస్ట్ పోలీసింగ్, సెక్షన్ల దుర్వినియోగం ఎప్పుడూ చూడలేదు. గత ఏడాది టీడీపీ ప్లీనరీ సమయంలో వైయస్సార్ విగ్రహానికి అడ్డుగా కట్టిన తోరణాలను తొలగించినందుకు మా పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో రాముపై పెట్రోల్ పోసి బండి తగలబెట్టి, హతమార్చేంత పనిచేస్తే.. తిరిగి బాధితుడైన రాము మీదే తప్పుడు కేసు పెట్టారు. మొన్న మున్సిపల్ నామినేషన్ల సమయంలో మాపై దాడి చేసి, ఫైరింగ్ జరిపి.. తిరిగి మా కార్యకర్తలు 900 మందిపై 307 కేసులు పెట్టారు. నిన్న చక్రాయపేటలో, నేడు అగుడూరులో సర్పంచ్ నామినేషన్లు వేయడానికి వెళ్లిన మా కార్యకర్తలపై టీడీపీ మూకలే మొదట పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేశాయి. దాన్ని ఎదుర్కొంటే మళ్లీ మా వాళ్ల మీదే నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు బనాయిస్తున్నారు. ఈ అక్రమ కేసులన్నింటిపైనా జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం. - మా కార్యకర్తలు బయట ఉంటే తట్టుకునే దమ్ము లేదు.. అధికార పార్టీలో ఉన్నది మీరే. డీఐజీ, ఎస్పీ, కలెక్టర్, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లోనే ఉంది. అయినా వైయస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయండి, అరెస్టు చేయండి అని మీరు స్టేషన్ ముందు ప్రాధేయపడుతున్నారంటే.. మా కార్యకర్తలు ఊళ్లలో బయట ఉంటే ఎన్నికలు చేసుకునే దమ్ము, ధైర్యం మీకు లేదని మీరే స్వయంగా ఒప్పుకున్నట్టే. రెండున్నరేళ్ల పాలనలోనే మీ పరిస్థితి ఇంత దయనీయంగా, అధ్వానంగా ఉంటే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మీ పరిస్థితి ఎలా ఉంటుందో బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి ఆలోచించుకోవాలి. - ప్రశాంత పల్లెల్లో మళ్లీ ఫ్యాక్షన్ విషబీజాలు వైయస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా రూపుమాపి, కృష్ణా జలాలతో పులివెందులను అగ్రికల్చర్, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఇక్కడి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ కలిసి మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు. 2021లో మేము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా నామినేషన్లు చించినట్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేసినట్లు దమ్ముంటే ఒక్క ఆధారం చూపించండి. నాడు పోటీ చేసే దమ్ము లేక మీరే చేతులెత్తేసి పారిపోయారు. నేడు మా వాళ్లు ప్రాణాలు పణంగా పెట్టి నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? - వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు ఈ నేపధ్యంలో ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రజలు గమనిస్తూ.. అసహ్యించుకుంటున్నారని అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకున్నందుకు ప్రజల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.... రాబోయే సాధారణ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకుని, కిరాయి మూకలను, తప్పుడు కేసులను పక్కన పెట్టి సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయినా ప్రశాంతంగా జరిగేలా చూడాలని అప్పుడు... ప్రజల్లో ఎవరి బలం ఏంటో తెలుస్తుందని సవాల్ చేశారు.