తాడేపల్లి: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో సాగిన భారీ కుంభకోణంపై అసలు సూత్రధారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వై.నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. ‘రుక్మిణి కోట రహస్యం’ పేరుతో సాగుతున్న ఈ వ్యవహారం కేవలం రూ.7 కోట్ల స్కామ్ కాదని, ఇది రూ.700 కోట్లకు పైగా సాగిన భారీ కుంభకోణమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే చంద్రబాబు ప్రభుత్వం వేసే సిట్, సీఐడీ విచారణతో న్యాయం జరగదని, తక్షణమే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని తేల్చి చెప్పారు. కోట రుక్మిణి ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్‌గా పని చేసిన ఒక దిగువ మధ్య తరగతి మహిళ ధరణిని బలిపశువు చేసి, అసలు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్ మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో వై.నాగార్జునయాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లా ‘రుక్మిణి కోట రహస్యం’: ‘రుక్మిణి కోట రహస్యం’ ఒక సినిమా అనుకున్నాం. కానీ రోజుకో కొత్త ఎపిసోడ్‌తో, అవినీతిలోని అన్ని కోణాలతో నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంతరంగికురాలు, జనసేన కేంద్ర కార్యాలయ వ్యవహారాల ఉపాధ్యక్షురాలు కోట రుక్మిణి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల అమ్మకాలు జరిగాయని ఆధారాలతో బయట పెట్టాం. దీనిపై సమాధానం చెప్పాల్సింది పోయి తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు జనసేన అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా అబ్యూసర్లు బూతులతో విరుచుకుపడుతున్నారు. ఇది అత్యంత హేయం. పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపడం లేదు?: ఈ వ్యవహారంపై ఆర్కే (రుక్మిణి కోట) ట్విట్టర్‌లో స్పందించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కేకే (కళ్యాణ్ శ్రీనివాస్) ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అసలు స్పందించాల్సింది ఆర్కేనో, కేకేనో కాదు.. పీకే (పవన్ కళ్యాణ్) సమాధానం చెప్పాలి. జనసేనకు ఎంతో ఇష్టమైన 11వ తేదీ నుంచే ఈ కుంభకోణం బయటపడింది. ఆ 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దానిపై నోరెందుకు మెదపడం లేదు? మరోవైపు సత్యమేవ జయతే అని ట్వీట్ పెడుతున్న రుక్మిణి కోట, అంత కంటే ముందు అందరూ ప్రస్తావిస్తున్న ‘వేర్ ఈజ్ 7 క్రోర్స్’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. జనసేనలో ఆ ‘కట్టప్పలు’ ఎవరు?: కేకే శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో కట్టప్పలు ఉన్నారని, అంతర్గత విషయాలను బయటకు ఇస్తూ తనను వెన్నుపోటు పొడిచారని నిజాయితీగా ఒప్పుకోవడం మంచి పరిణామం. ఇంతకూ జనసేనలో ఉన్న ఆ కట్టప్పలు ఎవరు? నాగేంద్రబాబు గారా? నాదెండ్ల మనోహర్ గారా? లేక హరిప్రసాద్ గారా? అనేది కేకే చెప్పాలి. విక్రమార్కుడు సినిమాలో దొంగతనం సొమ్ము పంచుకున్నట్లు, పవన్ కళ్యాణ్, రుక్మిణి కోట, నాగబాబు, హరిప్రసాద్, కేకేల మధ్య పంపకాల్లో తేడాలు రాబట్టే ఈ స్కామ్ బయటపడింది. ఇప్పుడు అభం శుభం తెలియని ఒక దిగువ మధ్య తరగతి మహిళ ధరణిని మంగళగిరి పోలీసుల చేత అరెస్ట్ చేయించి, మూడు రోజులు చిత్రహింసలకు గురి చేశారు. అలా మొత్తం తప్పంతా ఆమె మీదే నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. డేటాబేస్ మార్పు, అటవీ శాఖ ఉద్యోగాల నిలిపివేతపై అనుమానాలు: స్వయంగా కేకే విడుదల చేసిన వీడియోలోనే ధరణి ఒక సంచలన విషయం చెప్పారు. ఏపీపీఎస్సీ డేటాబేస్‌నే మార్చేసే కెపాసిటీ తమకు ఉందని, దాని వెనుక రుక్మిణి కోట, పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన అటవీ శాఖలో గత ప్రభుత్వ హయాంలోనే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన 780 ఉద్యోగాల భర్తీని ఉన్నఫలంగా ఎందుకు ఆపేశారు? ఈ స్కామ్‌తో దానికి ఏమైనా లింక్ ఉందా? దేవాదాయ శాఖలో ఈవోలు, అసిస్టెంట్ కమిషనర్లను కూడా ప్రభావితం చేసే శక్తి ధరణి వెనుక ఉన్న ఆ ’సనాతనవాది’ పవన్ కళ్యాణ్‌దే కదా? ప్రభుత్వ ఎంబ్లమ్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి 36 మంది నిరుద్యోగుల వద్ద రూ.7 కోట్లు వసూలు చేసిన దొంగల ముఠా ఎవరిది? మంగళగిరి టు లండన్ మనీ లాండరింగ్.. ఈడీ, సీబీఐ విచారణ కావాలి: మంగళగిరి నుంచి లండన్‌లోని రుక్మిణి కోట ’కైరన్’ సంస్థ ఖాతాలకు నిరుద్యోగుల డబ్బు మనీ లాండరింగ్ జరిగింది. స్వయంగా మీడియాకు కెకె ఇచ్చిన బ్యాంక్ రసీదుల్లోనే రూ.10 లక్షల చొప్పున లండన్ సంస్థకు బదిలీ అయినట్లు స్పష్టంగా ఉంది. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిన ఈ వ్యవహారంపై ఈడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ, పవన్ కళ్యాణ్ బినామీగా నిర్మిస్తున్న సినిమాల ఆర్థిక వ్యవహారాల్లోనూ ఈ స్కామ్ డబ్బులు వాడారని వీడియోల్లోనే వెల్లడైంది. పవన్ ఆఫీసులోని లాకర్ రూమ్ తాళాలు రుక్మిణి, ధరణి వద్ద మాత్రమే ఉంటాయని బయటపడింది. అందుకే తక్షణమే జనసేన కేంద్ర కార్యాలయ సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకోవాలని నాగార్జునయాదవ్ కోరారు.