ఎన్నికలు ఎందుకు.. టీడీపీ కార్యాలయంలోనే పదవులు ప్రకటించుకోవచ్చుగా?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ 

అన్న‌మ‌య్య జిల్లా: రాయచోటి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కాకులారంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేసి ఫోన్ లాక్కున్నారని, నూలివీడు, కాటిమాయకుంట, గోపగుడిపల్లెల్లోనూ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  కోర్టు ఆదేశాలున్నప్పటికీ పోలీసులు అభ్యర్థులకు సహకరించడం లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నామినేషన్ వేయలేదని రాసివ్వాలని, పత్రాలపై సంతకాలు చేయాలని అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ల తిరస్కరణకు గల కారణాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించాలని కోరారు.

 నామినేషన్ వేసినందుకే కేసులా?

హసనాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వారిపై రాళ్ల దాడి చేసి, అనంతరం రిటైర్డ్ లెక్చరర్‌పై 307 కేసు నమోదు చేసి జైలుకు పంపారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేని ఆయన కుమారుడు కిషోర్‌ను కూడా అరెస్టు చేసి 13 రోజుల రిమాండ్‌కు పంపారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలనుకునే వారినే కేసులతో భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న తన ప్రయత్నాలను గుర్తుచేస్తూ, ప్రస్తుతం అభివృద్ధికి బదులుగా రాజకీయ దౌర్జన్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది

ఆర్డీఓ కార్యాలయం వద్ద బాధిత అభ్యర్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా పోలీసులు, అధికార పార్టీ వర్గాలు అడ్డంకులు సృష్టించాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదులు చేశామని, తాజాగా ఆర్డీఓకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top