బాపట్ల జిల్లా: పాండురంగాపురం ఎంపీటీసీ సభ్యుడు నక్కా వీరారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 135/2026 కేసులో నవంబర్ 19 నుంచి నాలుగు రోజులపాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 22న జరగనున్న ఎంపీపీ ఎన్నికల్లో వీరారెడ్డి ఓటు వేయాల్సి ఉందని, అరెస్టు చేస్తే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కోల్పోతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో సహనిందితుడి వాంగ్మూలం ఆధారంగా ఆయనను కేసులో నిందితుడిగా చేర్చారని వాదించారు. ఎన్నికల నేపథ్యంలో వీరారెడ్డిని అరెస్టు చేయబోమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కులు కాకపోయినా చట్టబద్ధమైన హక్కులని, ప్రజాస్వామ్య పాలనలో వాటికి ఎంతో ప్రాధాన్యం ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో అర్హులైన వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. అయితే దర్యాప్తుకు వీరారెడ్డి సహకరించాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని షరతు విధించింది. జస్టిస్ మహేశ్వరరావు కుంచెం ధర్మాసనం నవంబర్ 19న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీరారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది జె.సుదర్శనరెడ్డి వాదనలు వినిపించారు.