తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, పులివెందుల పరిధిలోని 21 పంచాయతీల్లో నామినేషన్లను పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయా పంచాయతీల్లో పోలీసుల ఎస్కార్ట్ తో నామినేషన్లు వేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఎన్నికల కమిషన్, పోలీసుల కుమ్మక్కును ప్రజలు గమనించాలని అంబటి రాంబాబు ప్రజల్ని కోరారు. అలాగే రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన అంబటి రాంబాబు.. ఆయన ఏమైనా ప్రజలకు సేవచేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే..: అధికార కూటమితో ఎస్ఈసీ కుమ్మక్కు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగాయో మనం చూశాం. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైనా ఫర్వాలేదు కానీ.. ఇక్కడ అధికార కూటమితో కుమ్మక్కు అయిపోయింది. చిత్రం ఏంటంటే.. ఎన్నికలు జరగడం, నామినేషన్లు వేయడం, ఓట్లు అడగటం, పోలింగ్ జరగడం, ఓట్లు లెక్కించడం ఇవన్నీ పక్కనబెట్టేసి ఏకగ్రీవాలవైపు నడుస్తోంది. వైఎస్సార్సీపీకి సంబంధించిన వారు నామినేషన్లు దాఖలు చేస్తే నామినేషన్ పత్రాలు చించేయడం, దౌర్జన్యాలు చేయడం చూశాం. ఇప్పుడు పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల్లో గుర్తులుండవు. కేవలం సానుభూతిపరులు మాత్రమే పోటీ చేస్తారు. వీటిలో మొదటి దశ అయిపోయింది, రెండో దశ జరుగుతోంది, మూడో దశ జరగాల్సి ఉంది. వీటిలోనూ తీవ్రమైన అరాచకం జరుగుతోంది. నామినేషన్ పత్రాలు తీసుకుని నామినేషన్ వేయడానికి వెళ్లిన వాళ్లను వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు కొడతారు, పోలీసులు పక్కనే ఉండి వారికి రక్షణ ఇస్తారు. పత్రాలు చించేసిన తర్వాత మిమ్మల్ని తరిమి కొడతారు. ఇదంతా ఓ కాంట్రాక్టు పద్దతిలో జరుగుతోంది. ఎన్నికల్లో నామినేషన్లు వేయడం, ఓట్లకు డబ్బులివ్వడం, కొనడం అంతా అనవసరం, పోలీసుల్ని కొందాం, అధికారుల్ని కొందాం సింపుల్ గా అయిపోతుందన్న వ్యాపార పద్దతిలో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్ని నడుపుతున్నారు. పులివెందులలో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ: రాష్ట్రంలో ఇవాళ కూడా పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ కేంద్రాలకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని కొట్టడం, తలలు పగులగొట్టడం చేశారు. పులివెందులలో సైతం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. సుమారు 21 పంచాయతీల్లో ఇవాళ వైఎస్సార్సీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయలేకపోయారు. అంటే వారు వేయలేకపోవడం కాదు, నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు కొట్టారు. వెంటనే అక్కడున్న స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోలీసుల్ని సంప్రదించి, వీళ్లను అడ్డుకోమని పదే పదే చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో వేంపల్లె సర్పంచ్ అభ్యర్ధి షబ్బీర్ వలీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఓ చక్కటి తీర్పు వచ్చింది. ఈ 21 పంచాయతీల్లో అభ్యర్ధుల్ని పోలీసు ఎస్కార్క్ తో తీసుకెళ్లి నామినేషన్లు వేయించే బాధ్యత ఎన్నికల కమిషన్ దే, పోలీసు శాఖదే అని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతే కాదు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. హైకోర్టు జోక్యంతో అయినా పులివెందులలో పరిస్ధితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్నాం. ఇంత దుర్మార్గమైన, అరాచకమైన ఎన్నికల్ని చంద్రబాబు, ఎన్నికల కమిషన్, పోలీసులు కలిపి జరుపుతుంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, మేథావులపై ఉంది. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్ధితులు ఏపీలో, దేశంలో వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామంగా కనిపిస్తోంది. న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే తప్ప న్యాయం జరగని పరిస్ధితి ప్రతీచోటా కనిపిస్తోంది. ఈ పరిస్ధితుల్ని ప్రజలు కూడా అర్దం చేసుకోవాలని కోరుతున్నాం. మీడియా ప్రశ్నలకు జవాబిస్తూ … రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్దం కావట్లేదు. రామోజీరావు వ్యాపారవేత్తే కానీ సమాజ సేవకుడు కాదు కదా. ఆయన సమాజానికి ఏమైనా సేవ చేశారా ? సామాన్యుడిని ఏమైనా ఆదుకున్నారా ? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబుకు రక్షణగా ఉన్న వ్యక్తి ఆయన. అక్రమంగా, అన్యాయంగా కథలు రాసి ప్రజల్ని డైవర్ట్ చేసిన వ్యక్తి మాత్రమే. రామోజీ రావు చనిపోతే ఆయన వర్థంతి చేయడానికి రూ.10 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుపెట్టారు. ఏదో సామెత చెప్పినట్లు గోంగూర దొంగతనం జరిగినప్పుడే ఆపితే పోయేది. రామోజీరావు వర్ధంతి సభను ప్రభుత్వం 10 కోట్లతో ప్రభుత్వం నిర్వహించినప్పుడే విజ్ఞలైన ప్రజలు తిరుగుబాటు చేస్తే బావుండేది. కానీ ఇప్పుడు ప్రతీ సంవత్సరం ప్రభుత్వ ధనంతో ప్రజలు రామోజీరావు జయంతిని పండగ చేసుకోవాలంట. ఆయన ఏమైనా డబ్బుల్లేని వారా, వావిలాల గోపాలకృష్ణయ్యా, ప్రకాశం పంతులా.. దేశాన్ని దోచుకున్న వ్యక్తి, వ్యాపారాల్లో మోసం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరించే మహానుభావుడిగా భావించి ఆయనకు జన్మదినాలు పండుగలా చేసుకోవాలంటున్నారంటే.. రాష్ట్రంలో పాలన ఓ జోక్ అయిపోయిందని అర్థమవుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు ఈ జీవోను ఉపసంహకరించుకోవాలి. లేదు రామోజీ మా వాడు, మేం పండగలు చేస్తాం అంటే.. మీరు ఎల్లకాలం వాటిని చేయలేరు, కేవలం రెండేళ్లు మాత్రమే చేయగలరు. రామోజీ రావు ఎలాగో పోయారు, మీకు కూడా పోయేకాలం వచ్చినట్లుగా కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం. రామోజీరావు గారిని మేం ఏమీ కించపర్చడం లేదు. రామోజీరావు చాలా గొప్పోడు. కానీ ఆయన కుటుంబానికి మాత్రమే. బ్రహ్మండమైన వ్యాపారాలు చేసి ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తులు ఇచ్చుకున్నాడు. దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలుగుజాతికే గొప్పోడు అంటే ఎలా ? రామోజీరావు గొప్పోడైతే టీడీపీ వాళ్లు తమ ఆఫీసుల్లో, లేదా హెరిటేజ్ ఆఫీసుల్లో డబ్బులు తీసుకొచ్చి పండగలు చేసుకోండి, ప్రభుత్వ ధనం వెచ్చించి రామోజీ రావు పండగ చేసుకోండి అనడం పరమ దుర్మార్గం. రామోజీరావు మీద చాలా కేసులున్నాయి, వాటిని నిరూపణ కాలేదని కోర్టులు కొట్టేయలేదు. ఆయన చనిపోయాడు కాబట్టి కొట్టేశారన్నది గుర్తుంచుకోవాలి.