తాడేపల్లి: కేంద్రం చేపడుతున్న కులగణనను సమగ్రంగా నిర్వహించడం ద్వారా బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ఈనెల 28న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంఘీభావం ప్రకటించాలని కమిటీ ప్రతిని«ధులు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఛలో రాంలీలా మైదాన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని అభ్యర్థించేందుకు కమిటీ ప్రతిని«ధులు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిశారు. మండల్ కమిషన్ ఛైర్మన్‌గా పని చేసిన బీపీ మండల్ మనవడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గౌడ్ కిరణ్‌కుమార్, సకల్ ఓబీసీ మహామోర్చా అధ్యక్షుడు ఉమేష్ కుర్రం, డాక్టర్ పిట్టి మల్లికార్జున్‌యాదవ్‌తో పాటు, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం నాయకులు రాకేష్ దత్తా, పెండెం జయంతి యాదవ్ ఇంకా రజనీకాంత్ గౌడ్ శ్రీ వైయస్ జగన్‌ను కలిశారు. వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీ వైయస్ జగన్‌తో భేటీ అనంతరం అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధులు, వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..: కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి. :ప్రొ. సూరజ్ మండల్. ఏఐసీసీసీసీ ప్రతినిధి. నవంబర్ 28న ఢిల్లీ రాంలీలా మైదానంలో అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ఓ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో మేం కులగణన సమగ్రంగా నిర్వహించాలని, ఇందులో ఓబీసీ కాలం చేర్చాలని, ఓబీసీ కులాల డ్రాప్ డౌన్ మెన్యూ చేర్చాలని డిమాండ్ చేయబోతున్నాం. ఇవన్నీ జరిగితేనే ఓబీసీ కులాల అసలు లెక్కలు బయట పడటమే కాకుండా, వారికి రిజర్వేషన్ ఫలాలు లభిస్తాయి. ఏపీలో జరుగుతున్న స్దానిక సంస్ధల ఎన్నికల్లో బీసీల డేటా లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వేషన్ పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఢిల్లీలో మేం నిర్వహిస్తున్న భారీ సభకు జగన్‌గారిని ఆహ్వానించాం. మా డిమాండ్‌కు అండగా నిలవాలని ఆయన్ను కోరాం. ఎప్పుడూ బీసీలకు అండగా నిల్చే జగన్‌గారు, వెంటనే సానుకూలంగా స్పందించారు. కులగణనలో సామాజిక పరిస్థితుల ఆధారంగా లెక్కలు తీయాలి. :కిరణ్ కుమార్. అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు. కులగణనలో ఓబీసీలతో సహా, అన్ని కులాల్ని లెక్కించాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 60 ఓబీసీ సంఘాలతో అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ఏర్పడింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి ఓబీసీ మహాసభ, మహారాష్ట్ర నుంచి సకల్ ఓబీసీ మహాసంఘ్, కర్నాటక నుంచి ఓబీసీ ఫెడరేషన్, తమిళనాడు నుంచి రైట్స్ ఫర్ ద ఓబీసీ పార్టీస్ ఇలా.. కాశ్మీర్ నుంచి కేరళ వరకూ ఉన్న ఓబీసీ సంఘాలన్నీఇందులో భాగస్వాములవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీల్లో అన్ని కులాల్ని లెక్కించేందుకు వీలుగా డ్రాప్ డౌన్ ఆప్షన్ అమలు చేయాలని మేం కోరుతున్నాం. రాంలీలా మైదానంలో నిర్వహించబోతున్న ర్యాలీలో ఎన్డీయే కూటమి కాకుండా మిగతా పార్టీలన్నింటినీ కలుస్తున్నాం. అందులో భాగంగానే జగన్‌గారిని కూడా ఆహ్వానించాం. బీసీలకు 50 శాతం సీలింగ్ బ్రేక్ కావాలంటే కుల గణనలో సామాజిక పరిస్ధితుల ఆధారంగా లెక్కలు తీయాల్సిందే. జనగణన ద్వారా పూర్తి డేటా బయటికి వస్తే కోర్టుల్లో రిజర్వేషన్లకు రక్షణ దొరుకుతుంది.