పులివెందులలో టీడీపీ, పోలీసుల ఓవరాక్షన్

నామినేషన్లకు అడ్డంకులు.. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అభ్యర్థుల అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆందోళన

వైయ‌స్సార్ జిల్లా : పులివెందుల నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలు, పోలీసుల జోక్యంపై ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లి, పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, చక్రాయపేట మండలాల్లో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. వేంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పాటు, పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, సర్పంచ్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

వేంపల్లి, ఈ కొత్తపల్లి నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన వ్యక్తులు గుమికూడి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కణంపల్లిలో సర్పంచ్ అభ్యర్థి ఇంటికి పోలీసులు వెళ్లడం, ఘటనలను చిత్రీకరించిన వారి ఫోన్లు తీసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి పోలీసు అధికారులను ప్రశ్నించగా, పైస్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయని సీఐ పురుషోత్తంరాజు చెప్పినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తెలిపారు. 

తొండూరు మండలం ఉాదవగండ్లలో అర్ధరాత్రి కర్రలు, రాడ్లు, రాళ్లతో టీడీపీ వర్గాలు సంచరించాయని, వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడులు జరిగి పలువురు గాయపడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పేర్కొన్నారు. మల్లెల గ్రామంలో గౌస్‌పై దాడి చేసి, వాహనానికి వారే నిప్పుపెట్టి వైయ‌స్ఆర్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేశారు. సింహాద్రిపురం మండలం తెలికిలో సర్పంచ్ అభ్యర్థి రమణయ్య, ప్రపోజర్ శివప్రతాప్, బాబుతో పాటు మండల కన్వీనర్ శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Image

పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న సర్పంచ్ అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. వేంపల్లి నాలుగో సచివాలయం వద్ద టీడీపీకి చెందిన వ్యక్తులు రాళ్లు, కట్టెలు సమీకరించి నామినేషన్ కేంద్రాన్ని చుట్టుముట్టారని, బయట నుంచి రౌడీ మూకలను వాహనాల్లో తరలిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తెలిపారు. నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేసుకునేలా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పార్టీ కోరింది.

Image

పులివెందుల అసెంబ్లీలో నామినేషన్ కేంద్రం వద్ద దాడి

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గాలు దాడికి పాల్పడటంతో మాలిక్ గాయపడినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కేంద్రం వద్ద ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాయి.

దాడిలో గాయపడిన మాలిక్‌ను చికిత్స కోసం తరలించారు. నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాయి.

Back to Top