విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూటమి నాయకులు పోలీసుల సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చించివేయడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయని తెలిపారు. రాయచోటి, పల్నాడు, అన్నమయ్య జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు, మంత్రుల కనుసన్నల్లో యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులను హౌస్ అరెస్టు చేయడం, కిడ్నాప్‌లకు పాల్పడడం మరియు బలవంతపు ఉపసంహరణలకు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాబోయే విడతల్లో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్‌ని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే... పోలీసుల సహకారంతో దౌర్జన్యాలు చేస్తున్నారు - మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూటమి నాయకులు చేస్తున్న కుట్రలు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలను ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రజలందరూ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే, చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు రౌడీయిజం చేసుకోవడానికి, ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేయడానికి, పోలీసుల సహకారంతో వారిని అడ్డుకోవడానికి మాత్రమే స్వేచ్ఛాయుత ఎన్నికలు కల్పిస్తున్నారా? సర్పంచ్ ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకులు నామినేషన్లు వేయడానికి వెళ్తే పత్రాలను చించివేయడం, హౌస్ అరెస్టులు చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. గత రెండు మూడు నెలలుగా మున్సిపల్ ఎన్నికలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదలుకొని అనేక అంశాలపై ఎన్నికల కమిషన్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా, అధికారులకు పంపుతున్నామని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలోని ఒక్క సంక్షేమ హామీని కూడా అమలు చేయలేకపోయారని, కనీసం రాష్ట్రంలోని జైళ్లనైనా బాగు చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాం. 2029లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, తప్పు చేసిన వారిపై రాజ్యాంగబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూస్తామని స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికీ స్వేచ్ఛగా నామినేషన్లు వేయలేని దుస్థితి - రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ ఈరోజు పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్లకు చివరి రోజు అయినప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి మా అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్లు వేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నాం. ఎన్నికల కమిషనర్ కూడా అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్లు వేయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రాయచోటిలో మాత్రం నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను హౌస్ అరెస్టులు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. రాయచోటిలోని ఐదు మండలాల్లో అనేక చోట్ల నామినేషన్లు వేయనివ్వకుండా పోలీసులు కూడా అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునే హక్కు కూడా అభ్యర్థులకు లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం నిజంగా అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు భయపడుతోంది, మా అభ్యర్థులు ధైర్యంగా పోటీకి వస్తుంటే వారిని ఎందుకు అడ్డుకుంటోంది? రెండో విడత ఎన్నికల్లోనైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం - కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి నిన్నటి నుంచి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం నాయకులు, మంత్రులు చేస్తున్న అకృత్యాలు, ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర యంత్రాంగం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లో కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేయాలి, కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో మా అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, నాయకులను మామిడి తోటల్లో నిర్బంధించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. బాపట్ల జిల్లాలో నామినేషన్ తిరస్కరణపై ప్రశ్నించిన వ్యక్తిని హౌస్ అరెస్టు చేయగా, కావలిలో మా అభ్యర్థి నామినేషన్‌ను అడ్డుకోవడంతో పాటు ప్రశ్నించిన ఎమ్మెల్యేపై కూడా పోలీసులు దాడికి దిగిన పరిస్థితి ఉంది. గుడివాడలో అన్ని పత్రాలు సక్రమంగా సమర్పించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తుండగా, అధికార పార్టీ అభ్యర్థుల తప్పులున్న నామినేషన్లను మాత్రం అనుమతిస్తున్నారు. పోలీసులే కాకుండా రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబాలపై సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా జరుగుతున్న దుష్ప్రచారంపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనిపైనా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అక్రమ కేసుల్లో ఇరికించి భయపెడుతున్నారు - మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకునేందుకు కొత్త కుట్రలకు తెరతీసింది. బలమైన అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెట్టడం, అక్రమంగా గంజాయి లేదా ఇతర కేసుల్లో ఇరికించడం, పోలీసులే ఫోన్ చేసి పోటీ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేస్తూ, అధికార పార్టీ నాయకులకు మాత్రం స్వేచ్ఛనిస్తున్నారు. స్క్రూటినీ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసి తిరస్కరించడం, అధికార పార్టీ అభ్యర్థుల పత్రాల్లో తప్పులున్నా అనుమతించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఉపసంహరణల సమయంలో అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, ప్రపోజర్లను బెదిరించి సంతకాలు చేయించడం, కొన్నిచోట్ల అభ్యర్థుల ప్రమేయం లేకుండానే ఉపసంహరణ పత్రాలు సమర్పించడం వంటి కుట్రలు కూడా చోటుచేసుకున్నాయి. రాయచోటి, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, అరెస్టుల పేరుతో తిప్పడం వంటి ఘటనలతో పాటు ఎన్నికల అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, అధికారుల ఏకపక్ష వ్యవహారాలపై ఆధారాలతో ఫిర్యాదు చేశాం. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, రెండో, మూడో విడత ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం.