తాడేపల్లి: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 100 రోజుల్లోనే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనిత ఇప్పుడు 30 నెలల పాలనలో ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సులభంగా లభిస్తున్న పరిస్థితి యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలు, రైల్వే స్టేషన్లు, మహిళా హాస్టళ్లు, పాఠశాలలు, రైతుబజార్ల పరిసరాల్లో సైతం మాదకద్రవ్యాల ప్రభావం పెరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి మత్తులో ఆడబిడ్డలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నాగమల్లీశ్వరి ధ్వజమెత్తారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... నేరాల సంఖ్య ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనిత ఇప్పుడు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతుంటే యువత భవిష్యత్తును ఎలా కాపాడుతారు? కాలేజీలు, రైల్వే స్టేషన్లు, మహిళా హాస్టళ్లు, పాఠశాలల పరిసరాల్లో మాదకద్రవ్యాలు అందుబాటులో ఉండటం ప్రభుత్వ వైఫల్యం కాదా? హోంమంత్రి సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడుతుంటే ఆమె పట్టించుకోవడం లేదు. ఈగల్ టీమ్‌లు, డ్రోన్లు, శక్తి యాప్‌లు ఉన్నాయని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో వాటి పనితీరు కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2,444 కేసులు నమోదై, 6,332 మంది అరెస్టయ్యారు, 60,782 కిలోల గంజాయి, 126 కిలోల ఇతర మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని వేల కిలోల గంజాయి పట్టుబడుతున్నా సరఫరా వెనుక ఉన్న అసలు మాఫియాను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల వాహనంలోనే గంజాయి కనిపించిన ఘటన రాష్ట్రంలో పోలీసుల పనితీరుకి అద్దం పడుతోంది. గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నా, ఆడబిడ్డలపై దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు తీసుకోకపోవడం దారుణం. వైఎస్సార్‌సీపీ హయాంలోనే పటిష్టంగా గంజాయి నియంత్రణ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణ కోసం ఆపరేషన్ పరివర్తన్ చేపట్టి, 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి, సుమారు 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేసి, 2,950 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. గంజాయి నియంత్రణకు 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో యువతకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా మార్గాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాం. మేము ఆచరణలో చేసి చూపించిన కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, వజ్ర ప్రహార్, సేఫ్ క్యాంపస్ జోన్ వంటి కార్యక్రమాల ఫలితాలను ప్రభుత్వం వివరించాలి. గంజాయి మాఫియా వెనుక ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. యువత భవిష్యత్తును, మహిళల భద్రతను కాపాడలేని హోంమంత్రి అనిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రచారాలు పక్కనపెట్టి గంజాయి నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలని నాగమల్లీశ్వరి హితవు పలికారు.