చిత్తూరు జిల్లా: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం రాయలపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన హేమచంద్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. అధికారుల చేతుల్లో నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి రమణ దౌర్జన్యంగా ఆ పత్రాలను చించివేసి, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని వైయస్ఆర్సీపీ పేర్కొంది. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కును అడ్డుకోవడం సరికాదని తెలిపింది. ఇది కేవలం ఒక అభ్యర్థిపై జరిగిన దౌర్జన్యం కాదని, రాయలపేట ప్రజల ఓటు హక్కుపై దాడి అని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో గెలవాలంటే ప్రజల ఓట్లతో గెలవాలి కానీ దౌర్జన్యంతో కాదని వైయస్ఆర్సీపీ స్పష్టం చేసింది. హేమచంద్ర నామినేషన్ దాఖలు చేసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుని, అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని కోరింది.