లోకేశ్‌ ‘ఫీజు కట్టు’ కథ 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.5 వేల కోట్లు చెల్లించేశామని ప్రచారం

ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నట్టు తన ‘ఎక్స్‌’ ఖాతాలో డప్పు 

అడ్మిషన్లు పూర్తవకుండానే 2026–27కి కూడా రూ.1,845.63 కోట్లు ఇచ్చేశారట!

అమరావతి: అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరుమోసిన చంద్రబాబునాయుడిని మించిపోయారు ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే.. వాస్తవాలు గ్రహించి సమస్యను పరిష్కరించాల్సిందిపోయి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024–25 విద్యాసంవత్సరం నుంచి రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5 వేలకోట్లు చెల్లించేశామని సోమవారం తన ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారు. అంతేకాదు.. ప్రతినెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని కూడా చెప్పారు. ఇంకా విడ్డూరం ఏంటంటే.. ప్రస్తుతం 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగలేదు. అర్హులైన విద్యార్థులు ఎంతమందో లెక్క తేలలేదు. అయినా.. ఈ విద్యాసంవత్సరానికి రూ.1,845.63 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చేశామని చెప్పేశారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంపై విద్యార్థిలోకం మండిపడుతోంది. 

13 త్రైమాసికాలు పెండింగ్‌ పెట్టి అబద్ధాల ప్రచారం 
గత ప్రభుత్వంలో విద్యాదీవెన, వసతిదీవెన క్రమం తప్పకుండా చెల్లించగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం కాగితాలకే పరిమితం చేసింది. ఇక వసతిదీవెనను పూర్తిగా ఎత్తేశారు. విద్యాదీవెనను 2024 జనవరి–మార్చి త్రైమాసికం నుంచి పెండింగ్‌ పెట్టారు. ఎన్నికల కోడ్‌ రావడంతో చివరి ఒక్క త్రైమాసికమే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ పెడితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యాసంవత్సరం చివరివరకు చూస్తే మొత్తం 13 త్రైమాసికాలు ఇవ్వాల్సి ఉంది. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు చెల్లించాలి.

అంటే మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.9,100 కోట్లు బాకీ. వసతిదీవెన ప్రతి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. 2024, 2025, 2026 ఏప్రిల్‌ నెలల్లో రూ.1,100 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ మూడేళ్లకు కలిపి రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. విద్యాదీవెన, వసతిదీవెన కలిపి మొత్తం రూ.12,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు ఇచ్చింది ఒకసారి రూ.1,700 కోట్లు. మరోసారి రూ.1,100 కోట్లు కలిపి రూ.2,800 కోట్లు. అంటే ఇంకా రూ.9,600 కోట్లు చెల్లించాల్సి ఉంది.

కానీ లోకేశ్‌ మాత్రం గత రెండున్నరేళ్లలో రూ.5 వేలకోట్లు ఇచ్చేశామని చెప్పడం, ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా రూ.1,845.63 కోట్లు ఇచ్చేశామని చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు నవ్వుతున్నారు. ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఒకవైపు చదువులు మానేసే దుస్థితి నెలకొనగా, మరోవైపు ఆత్మహత్యలే శరణ్యమని బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఇలా అబద్ధాలు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అబద్ధాలను కూడా గట్టిగా చెప్పడంలో తండ్రిని మించిన తనయుడంటూ విమర్శిస్తున్నారు.  

Back to Top