తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకో వివాదం, వారానికో కుంభకోణం వెలుగులోకి వస్తోందని, తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా ఆ పార్టీ కీలక నేత రుక్మిణి కోట ఆధ్వర్యంలో రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం బయట పడిందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వై.నాగార్జునయాదవ్ ధ్వజమెత్తారు. ఈ కుంభకోణానికి జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కచ్చితంగా బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా, ఈ కేసులో ఒక సాధారణ దళిత మహిళ ధరణికృష్ణను పావుగా చేసి జనసేన నేతలు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివశ్రీనివాస్, జనసేన ఉపాధ్యక్షురాలు కోట రుక్మిణి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో వై.నాగార్జునయాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: జనసేన కార్యాలయంలో ‘రుక్మిణి కోట రహస్యం’: పాత సినిమాల్లో ’రాజకోట రహస్యం’ చూశాం. ఇప్పుడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ’రుక్మిణి కోట రహస్యం’ అనే కొత్త ఉద్యోగాల కుంభకోణం తొంగి చూసింది. పవిత్రమైన దేవాదాయ శాఖ, పోలీస్ శాఖలలో ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. ఈ వ్యవహారంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో 11వ తేదీ రాత్రి 9 గం.కు కేవలం 30 నిమిషాల వ్యవధిలో 1497, 1498 నంబర్లతో రెండు ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. ఒకటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ ఫిర్యాదుపై నమోదు చేయగా, మరొకటి పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ మరియు జనసేన కేంద్ర వ్యవహారాల శాఖ ఉపాధ్యక్షురాలు వెంకట నాగరుక్మిణి శ్వేత కోట ఫిర్యాదుతో నమోదు చేశారు. తమ వద్ద పనిచేసే ధరణి అనే మహిళ తమకు తెలియకుండానే సంస్థ పేరు వాడుకుని రూ.7 కోట్లు వసూలు చేసి లండన్‌కు పంపించిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ. బలిపశువును చేసే కుట్ర: వాస్తవానికి ధరణికృష్ణ పారిపోలేదు. 13వ తేదీ ఉదయం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకున్న పోలీసులు ఆమెను కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు అదృశ్యం చేశారు. ఆమె తల్లి గంగా నాగమణి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో, 16వ తేదీ అర్ధరాత్రి మంగళగిరి ఎయిమ్స్ పక్కన ఉన్న దట్టమైన చెట్లలో ఆమెను వదిలేశారు. శివశ్రీనివాస్, రుక్మిణి రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఒక చిన్న ఉద్యోగిని అయిన తన కుమార్తెను బలిపశువును చేశారని ఆ తల్లి పిటిషన్‌లో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు మంగళగిరి రూరల్ పోలీసులు ధరణిని రబ్బర్ బెల్ట్‌లు, లాఠీలతో దారుణంగా కొట్టి, ప్రైవేట్ పార్ట్స్‌లో సైతం గాయాలయ్యేలా చిత్రహింసలకు గురి చేశారని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన మెడికో లీగల్ కేస్ (ఎంఎల్‌సీ) సర్టిఫికెట్ స్పష్టం చేస్తోంది. నిజంగా ధరణి తప్పు చేసి ఉంటే, మూడు రోజులు అక్రమ నిర్బంధంలో ఉంచి హింసించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చకుండా ఎందుకు వదిలేశారు? ఆమెకు ఏ పాపం తెలియదు కాబట్టే, ఉద్యోగాల పేరుతో చేసిన కుంభకోణం తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో దొంగలే ముందుగా ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. ఉన్నతాధికారుల మౌనం వెనుక అసలు కథానాయకుడు ఎవరు?: ఒక దళిత మహిళను మూడు రోజుల పాటు అదృశ్యం చేస్తే.. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, గుంటూరు ఎస్పీ, మంగళగిరి డీఎస్పీకి లేఖలు రాసినా, ఫోన్లు చేసినా ఎవ్వరూ స్పందించలేదు. కనీసం నోరు మెదపలేదు. ఉన్నతాధికారులందరి నోళ్లు మూయించి, ’రుక్మిణి కోట రహస్యాలు’ బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేసిన ఆ అసలైన కథానాయకుడు ఎవరనేది రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలి. నేను కానీ, హోం మంత్రి అయి ఉంటే ఏం చేసేవాడినో అని పవన్‌కళ్యాణ్ అంటుంటారు. హోం శాఖ మీ దగ్గర ఉంటే ఇలాంటి రహస్యాలు బయటకు రాకుండా తొక్కిపెట్టవచ్చనే కదా మీ ఉద్దేశం? ఎఫ్‌ఐఆర్ నమోదై ఆరు రోజులు గడుస్తున్నా ఆ రూ.7 కోట్లు ఎవరి ఖాతాలో జమయ్యాయో, ఎంతమంది నిరుద్యోగులు మోసపోయారో ఎందుకు బయటపెట్టడం లేదు?. లండన్ టూ మంగళగిరి.. మనీ లాండరింగ్ మోడల్: స్కిల్ స్కామ్ తరహాలోనే ఈ నిధులను యూకేలోని సంస్థకు రీరూటింగ్ చేసి, తిరిగి ఇండియాకు తెచ్చి మనీ లాండరింగ్ ద్వారా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారు. అక్టోబర్ 22, 2024న కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రుక్మిణి కోట ప్రారంభించిన ’కైరన్ కన్సల్టెన్సీ’ కేవలం 10 నెలల్లోనే రూ.10 కోట్ల రెవెన్యూ ఎలా సంపాదించింది? లండన్‌లోని ఫేక్ కంపెనీకి ధరణికృష్ణ డబ్బులు పంపిందని రుక్మిణి కోట చెబుతున్నారు కానీ, 28 ఏప్రిల్, 2023న లండన్‌లో ’కైరన్ టెక్ లిమిటెడ్’ను రిజిస్టర్ చేసింది స్వయంగా వెంకట నాగ రుక్మిణి శ్వేత కోటనే. దాన్ని అక్టోబర్ 10, 2024న క్లోజ్ చేసి, వారం రోజుల్లోనే మంగళగిరిలో అదే పేరుతో కన్సల్టెన్సీ పెట్టారు. తిరిగి నవంబర్ 12, 2024న బ్రిటిష్ ప్రభుత్వానికి రిస్టోరేషన్ అప్లికేషన్ పెట్టుకుని లండన్ సంస్థను మళ్లీ ప్రారంభించారు. ఒకే పేరుతో లండన్‌లో ఒక సంస్థ, మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మరో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ చేస్తున్నాయి. సినిమాలు ఫ్లాప్ అయినా, బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునే పొలిటికల్ కరప్షన్‌లో మాత్రం పవన్‌కళ్యాణ్ హిట్ మోడల్ సృష్టించారు. మీ పర్సనల్ సెక్రటరీ మీకు తెలియకుండా రెండు కంపెనీలు పెట్టి కోట్లాది రూపాయలు రూటింగ్ చేస్తుంటే మీకు తెలియదని ప్రజలు నమ్మాలా? ధరణి చేరకముందే ఫేక్ ఆఫర్ లెటర్లు ఎలా వచ్చాయి?: ప్రభుత్వ అధికారుల డిజిటల్ సిగ్నేచర్లు, ప్రభుత్వ ఎంబ్లమ్‌లు జనసేన పార్టీ కార్యాలయంలోని కైరన్ సంస్థలోకి ఎలా వచ్చాయి? కైరన్ సంస్థలో ధరణికృష్ణ జూన్, 2026లో హెచ్‌ఆర్‌గా చేరితే, డిసెంబర్ 19, 2025న కల్లా అప్పారావు అనే వ్యక్తికి కాళీ మాత ఆలయంలో ఈఓ ఉద్యోగం పేరిట ఫేక్ ఆఫర్ లెటర్, డిసెంబర్ 13, 2025న ఐడీ కార్డు (1798799) ఎలా ఇచ్చారు? ధరణికృష్ణ సంస్థలో చేరకముందే ఫేక్ ఆఫర్ లెటర్లు ఇచ్చారంటే, ఈ కుంభకోణానికి అసలు సూత్రధారులు ఎవరో స్పష్టమవుతోంది. రూ.25 వేల జీతానికి పని చేసే ఒక సాధారణ దళిత మహిళ.. రుక్మిణి కోట, శివశ్రీనివాస్‌ను, బ్రిటిష్ ప్రభుత్వాన్ని మోసం చేసి రూ.7 కోట్లు కాజేసిందని చెప్పడం హాస్యాస్పదం. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఈ నేపధ్యంలో.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కైరన్ కంపెనీతో పాటు ఇంకా ఎన్ని కంపెనీలు నడుస్తున్నాయి, వాటి ద్వారా కనపడని వందలాది కోట్లు ఎలా తరలించారో బయటపడాల్సిన అవసరం ఉందని నాగార్జునయాదవ్ తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై ఈడీ, సీఐడీ, విజిలెన్స్ విచారణ జరిగితే అధికారులు మౌనంగా ఉంటారు కాబట్టి వాస్తవాలు బయటకు రావు. అందుకే ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చి, దోషులెవరనేది తేలుతుందని నాగార్జునయాదవ్ స్పష్టం చేశారు.