పల్నాడు జిల్లాలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత

నాగవరంలో పోలీసుల లాఠీఛార్జ్, పలువురు మహిళలకు గాయాలు

పల్నాడు: పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం నాగవరంలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను సత్తెనపల్లికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా నాగవరం మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం జరగడంతో లాఠీఛార్జ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పలువురు మహిళలు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.

పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మునుగోడు గ్రామంలోనూ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. నామినేషన్ వేసే హక్కును అడ్డుకోవడం సరికాదని, ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.

గుంటూరు జిల్లా అనంతవరంలోనూ సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు తీసుకెళ్లారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలను అడ్డుకుని అభ్యర్థి ఆచూకీ చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభ్యర్థులకు స్వేచ్ఛ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరింది.

Back to Top