పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం అనంతరం గ్రామంలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. పోలీసుల దాడిలో పలువురు గాయపడ్డారని, నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ వర్గాలను ఉంచి దాడులు చేయించారని ఆయన పేర్కొన్నారు. క్రోసూరు ఎస్‌ఐ దాడిలో గాయపడి సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను నంబూరు శంకరరావు పరామర్శించారు. బాధితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి సత్తెనపల్లికి తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అదనపు ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నంబూరు శంకరరావు కోరారు.