మత్స్యకార సోదరులు చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేపల్లి: వైయ‌స్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం పలువురు మత్స్యకారులు కలిశారు. ఇవాళ జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా నష్టపోయామంటూ తమ సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేసి.. ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే, వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.

‘‘ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె.పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి  300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.

చంద్రబాబు.. రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి’’ అని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. 

Back to Top