మొగల్లూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

 వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ వేళ టీడీపీ నేతల హల్‌చల్

ప్రకాశం జిల్లా:  కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం మొగల్లూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ల పరిశీలన కేంద్రంలోకి సంబంధంలేని వ్యక్తులు ప్రవేశించి హల్‌చల్ సృష్టించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేలా దురుద్దేశంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపించింది. వెలిగండ్ల టీడీపీ మండల అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, గన్నవరం ఎంపీటీసీ దొడ్డ వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ స్క్రూటినీ కేంద్రంలోకి ప్రవేశించడంపై కనిగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్ రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు.

మొగల్లూరు నామినేషన్ కేంద్రం పరిధిలో మొగల్లూరు, హుస్సేన్‌పురం, బల్లవరం, గోకులం పంచాయతీలు మాత్రమే ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. సంబంధంలేని వ్యక్తులు స్క్రూటినీ కేంద్రంలోకి ఎలా ప్రవేశించారంటూ ప్రశ్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. 

Back to Top